ఖర్గేకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ అనిల్
హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
ఢిల్లీలో రోజంతా భేటీల మీద భేటీలు
తొలుత మహేశ్‌గౌడ్, మీనాక్షితో కేసీ వేణుగోపాల్ సమావేశం
సుస్మిత వ్యాఖ్యలతో ప్రభుత్వం, పార్టీలో గందరగోళం నెలకొందన్న పీసీసీ చీఫ్... అనంతరం సీఎంతో కలిసి ఖర్గే వద్దకు వెళ్లిన నేతలు
సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలన్న రేవంత్, మహేశ్!
అందరూ వెళ్లిపోయాక ఏఐసీసీ అధ్యక్షుడితో సురేఖ భేటీ
తాజా పరిణామాలు, సీఎం కుటుంబ సభ్యుల అవినీతి, భూకబ్జాలు తదితర అంశాలపై నివేదిక!
మీనాక్షితోనూ భేటీ.. తనను మంత్రివర్గంలో కొనసాగించాలని వినతి
సురేఖ మీడియాతో మాట్లాడిన తర్వాత ఖర్గేతో మళ్లీ రేవంత్ భేటీ
ఇందిరా భవన్ వేదికగా సురేఖ చేసిన ఆరోపణలపై ఫిర్యాదు
చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదన్న సీఎం!
రాహుల్‌తో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్న ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఢిల్లీ వేదికగా మరింత ముదిరింది. వివాదం అధిష్టానం వద్దకు చేరినా బుధవారం ఏమీ తేల్లేదు. సురేఖపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా..మరోవైపు సురేఖ కూడా తన వాదన గట్టిగా విన్పించారు. పైగా హైకమాండ్ పెద్దలతో భేటీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గనట్టుగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
రోజంతా నాటకీయ పరిణామాలు
ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ వేదికగా బుధవారం రోజంతా నేతల వరుస భేటీలు జరిగాయి. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సీనియర్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, దీని పర్యవసానాలు వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం.. బుధవారం వారితో సమావేశాలు నిర్వహించింది. కొండా సురేఖ విషయమై మంగళవారం రాత్రే ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకున్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్, బుధవారం తొలుత ఉదయం 11.30 గంటల సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. వారిద్దరి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా సుస్మిత, మంత్రి సురేఖల వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడు తప్పుపట్టినట్లు తెలిసింది. సుస్మిత వ్యాఖ్యలతో ప్రభుత్వం, పార్టీలో గందరగోళం నెలకొందని, అనేకమంది జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు దీన్ని తప్పుపట్టినట్లుగా మహేశ్ వివరించినట్లు సమాచారం. కూతురు మాట్లాడిన విషయాలను సురేఖ తప్పుపట్టకపోగా, ఆ వ్యాఖ్యలతో తనకేం సంబంధం అన్న రీతిలో స్పందించడం సరైంది కాదని అన్నట్టు తెలిసింది. సురేఖపై క్రమశిక్షణా చర్యల విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం.
ఎమ్మెల్యేలు స్పందించడంపై మీనాక్షి అసహనం!
అయితే పీసీసీ వైఖరికి భిన్నంగా మీనాక్షి స్పందించినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి కుమార్తె మాట్లాడితే దానిపై హుటాహుటిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించడం సరైందేనా? ఇది ఎవరి ఆదేశాల మేరకు జరిగిందన్న రీతిలో మీనాక్షి మాట్లాడినట్టు చెబుతున్నారు. పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడితే స్పందించని ఎమ్మెల్యేలు.. సుస్మిత వ్యాఖ్యలపై అంతలా స్పందించడాన్ని చాలామంది సీనియర్లు తప్పుపట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించినట్లు సమాచారం.
మధ్యలో వచ్చిన రేవంత్..
కేసీ వేణుగోపాల్‌తో మీనాక్షి, మహేశ్‌ల భేటీ జరుగుతుండగానే.. కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో భేటీ ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా ఇందిరాభవన్‌కు చేరుకుని వారితో జత కలిశారు. వీరి భేటీ కొనసాగుతుండగానే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కార్యాలయానికి రావడంతో అంతా కలిసి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ సురేఖ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా రాష్ట్ర నేతల అభిప్రాయాన్నీ వివరించారు. ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలన్న అభిప్రాయాన్నే ఖర్గే వద్ద వెలిబుచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలో పరిణామాలపై ఖర్గే అసంతృప్తి
రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న కుమ్ములాటలు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై ఖర్గే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో జరుగుతున్న వరుస పరిణామాలు, కలహాలతో చెడ్డపేరు వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీలోని నేతలపై అనేక ఫిర్యాదులు అధిష్టానానికి అందుతున్నాయని, వీటిని రాష్ట్ర స్థాయిలోనే కట్టడి చేయకపోవడానికి గల కారణాలపై గట్టిగా నిలదీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ, ప్రభుత్వం మధ్య కొరవడిన సమన్వయం, నేతల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో వైఫల్యమే దీనికి కారణమని ఆయన పేర్కొనట్లు సమాచారం. అయితే సురేఖ వ్యవహారంలో ఆమెను పిలిచి మాట్లాడతామని, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. గంట పాటు చర్చల అనంతరం ముఖ్యమంత్రి ఏఐసీసీ కార్యాలయం వెనుక గేటు ద్వారా బయటకి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మీనాక్షి సైతం అక్కడి నుంచి నిష్క్రమించారు.
సురేఖ ఎంట్రీ.. గంట పాటు వెయిటింగ్
ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షితో ఖర్గే, కేసీల భేటీ జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ సైతం ఇందిరాభవన్‌కు వచ్చారు. నేరుగా ఖర్గే కార్యాలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ గంట సేపు నిరీక్షించారు. సీఎం, మీనాక్షి, కేసీలు వెళ్లిపోయాక ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతి, వారిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, వివిధ సందర్భాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, కేబినెట్‌లోని ఇతర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయనకు ఒక నివేదిక అందించినట్లు తెలిసింది. అనంతరం సురేఖ మీడియాతో ముచ్చటించారు. 
ఖర్గేతో కొండా సురేఖ
మీనాక్షి, సురేఖ, ఉత్తమ్ మంతనాలు
మీడియాతో సురేఖ ముచ్చటిస్తున్న సమయంలోనే రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇందిరాభవన్‌కు వచ్చారు. ఉత్తమ్‌ను చూసిన సురేఖ ఆయనతో కలిసి ఇందిరాభవన్‌కు తిరిగొచ్చి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికను ఆమెకు అందజేశారు. తనను మంత్రివర్గంలో కొనసాగించాలని, తన కూతురు మాట్లాడిన దానికి తనను బాధ్యురాలిని చేయరాదని కోరారు. అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.
సురేఖ ఆరోపణలను ఖర్గేకు వివరించిన రేవంత్
సురేఖ విలేకరులతో మాట్లాడిన తర్వాత.. సీఎం రేవంత్ మరోసారి ఖర్గేను కలిసారు. సురేఖ విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యాలయం వేదికగా ఆమె ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలపై ఆరోపణలు చేశారంటూ ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నారని తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి కూడా పాల్గొన్నారు. కాగా ఈ అన్ని అంశాలపై రాహుల్‌గాంధీ ఢిల్లీకి వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఖర్గేతో భేటీ తర్వాత రేవంత్, భట్టి.. వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.


