తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి! | RS Bharathi criticized TVK leader Aadhav Arjuna | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయంలో ‘ధనుష్’ వేడి!

Sep 2 2026 7:02 PM | Updated on Sep 2 2026 7:27 PM

RS Bharathi criticized TVK leader Aadhav Arjuna

సాక్షి,చెన్నై: ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర రాజకీయ కాక రేపుతోంది. ధనుష్ తన పార్టీకి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికితోడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యూహకర్త, సీఎం విజయ్‌ ప్రధాన అనుచరుడైన ఆదవ్ అర్జున కూడా ధనుష్‌ పార్టీలో చేరబోతున్నారనే వార్తలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 

అయితే, టీవీకే పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆదవ అర్జున.. నిజంగానే ధనుష్ పెట్టే కొత్త పార్టీలో చేరుతారా? లేక ఇది ప్రత్యర్థులు ఆడుతున్న మైండ్ గేమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా, ఈ ప్రచారంతో తమిళనాడు పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

తమిళనాడు రాజకీయాలపై డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్‌.ఎస్‌. భారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులుండరు. నాకు సమాచారం అందింది. ఆదవ్ అర్జున.. ధనుష్‌ పార్టీలో చేరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

‘వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం మారినట్లే ఆదవ్ అర్జున కూడా సీజన్‌ బట్టి పార్టీలు మారుతుంటారు. ఆయన మా పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, ఆ తర్వాత విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) లోకి, ఇప్పుడు టీవీకేలో ఉన్నారు. ధనుష్‌ కొత్త పార్టీ పెడితే అందులో చేరే వారిలో మొదటి వరుసలో ఆదవ్ అర్జునే ఉంటారు’అని భారతి ఎద్దేవా చేశారు.

మద్దతుదారులు ఆయనను ‘ఆదవ్ అన్నా’ అని సంబోధించడంపై స్పందిస్తూ... ఎవరైనా ఒకరిని అన్నా అని పిలుస్తున్నారంటే, అది వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికో లేదా బుజ్జగించడానికే’ అని వ్యాఖ్యానించారు. వీసీకే పార్టీని చక్కదిద్దుతానని చెప్పి దాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని, చివరికి అక్కడి కార్యకర్తలను ఊడ్చేసి టీవీకేలో చేర్చారని ఆరోపించారు

విజయ్ బాటలోనే ధనుష్ అడుగులు?
ఇటీవల చెన్నైలో జరిగిన ఒక రక్తదాన శిబిరంలో ధనుష్ తన అభిమాన సంఘం కోసం ఒక కొత్త జెండాను ఆవిష్కరించడంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, సామాజిక సంక్షేమం,సమాజ సేవపై చురుగ్గా దృష్టి పెట్టాలని, ఒక గొప్ప ప్రయోజనం కోసం ఐక్యంగా పనిచేయాలని ధనుష్‌ తన అభిమానులను కోరారు.

గతంలో టీవీకే అధినేత, సీఎం విజయ్‌కూడా తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించడానికి ముందు ఇదే తరహాలో అభిమాన సంఘాలను సమీకరించి సామాజిక సేవ వైపు మళ్లించారు. దీంతో ధనుష్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. పాఠశాల భవనాలకు నిధులు సమకూర్చడం వంటి దాతృత్వ కార్యక్రమాలు కేవలం సేవా దృక్పథంతో చేసినవేనని ధనుష్ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆయన వేస్తున్న అడుగులు మాత్రం త్వరలోనే రాజకీయ రంగప్రవేశానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement