కూటమిలో కుతకుతలు | Clash Between Janasena And TDP | Sakshi
Sakshi News home page

కూటమిలో కుతకుతలు

Sep 2 2026 2:05 PM | Updated on Sep 2 2026 2:07 PM

Clash Between Janasena And TDP

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి రాజకీయాల్లో అధికార కూటమిలో మరోమారు వేడి రాజుకుంది. వైఎస్సార్‌సీపీ బహిష్కృత నేత మన్నెమాల సుకుమార్‌రెడ్డి కూటమిలోకి ఎంట్రీ అంశం ఇప్పుడు టీడీపీ, జనసేన వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఒక వైపు మన్నెమాల టీడీపీలో చేరే ప్రయత్నాలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న చర్చ.. ఇంకో వైపు మన్నెమాలను జనసేన ఇన్‌చార్జిగా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే కావ్య ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం.. వెరసి కూటమి రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. కూటమిలో అంతర్గత రాజకీయాల వెనుక జనసేనను బలహీన పరిచి టీడీపీ ఆధిపత్యాన్ని మరింత పెంచుకునే వ్యూహమనే ప్రచారం ఇప్పుడు కావలి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.  

మన్నెమాల ఎంట్రీకి మోకాలడ్డు?  
వైఎస్సార్‌సీపీలో కీలకంగా పని చేసిన మన్నెమాల సుకుమార్‌రెడ్డిని ఆ పార్టీ సస్పెండ్‌ చేయడంతో కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్‌పై కావలిలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార కూటమిలోకి చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి టీడీపీలోనే అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన్నెమాలను టీడీపీలోకి తీసుకురావడంపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఆయన వర్గం సానుకూలంగా లేదు. ఈ క్రమంలో మన్నెమాల ఎంట్రీకి బీద రవిచంద్ర మోకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కావలి రాజకీయాల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య నిప్పు.. ఉప్పులా ఉండగా మన్నెమాల వ్యవహారం ఆ అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

జనసేన ఇన్‌చార్జిగా మన్నెమాల?  
మన్నెమాల సుకుమార్‌రెడ్డిని జనసేన కావలి ఇన్‌చార్జిగా తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే కావ్య సైతం మన్నెమాలతో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతోంది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కావ్య.. రాజకీయంగా తటస్థంగా ఉన్న మన్నెమాలను నేరుగా టీడీపీలోకి తీసుకురావడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అదే సమయంలో జనసేనలోకి పంపిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయన్న అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే ఇప్పుడు కూటమి రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.   

పవన్‌ బర్త్‌డే వేదికగా కొత్త రాజకీయం 
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా కావలిలో భారీ ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే కావ్య, మన్నెమాల కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నారన్న ప్రచారం కూడా ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. సాధారణంగా జనసేన కార్యక్రమాలను ఆ పార్టీ స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ బహిష్కృత నేతతో కలిసి జనసేన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటన్న చర్చ మొదలైంది. మన్నెమాలను జనసేనలోకి తీసుకొచ్చే ప్రక్రియకు ఇదే తొలి అడుగా? అనే అనుమానాలు జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 

జనసేన విచ్ఛిన్నానికేనా..! 
కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పారీ్టలో ఉన్న కొందరు నేతలను పక్కకు తప్పించి, కొత్త వ్యక్తులను ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఆ పారీ్టలోనే కలకలం రేపుతున్నాయి. మన్నెమాల ఎంట్రీ కూడా ఈ వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పారీ్టలోని సీనియర్‌ నాయకులను బలహీనపరచడం.. వారి రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించడం.. ఆ తరువాత కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా జనసేనపై పరోక్షంగా పట్టు సాధించాలన్న వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలోని కొందరు నేతలను బయటకు గెంటేసేలా రాజకీయంగా స్కెచ్‌లు సిద్ధమవుతున్నాయన్న ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయి.  

అధికారానికి ముందు వెంచర్లపై రచ్చరచ్చ

మన్నెమాల సుకుమార్‌రెడ్డికి సంబంధించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు గతంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కూటమి అధికారంలోకి రాక ముందు ఆయనకు సంబంధించిన రియల్‌ వెంచర్లపై టీడీపీ వర్గాల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భాలను రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు అవుతున్నప్పటికీ మన్నెమాలకు సంబంధించిన రియల్‌ వెంచర్లపై అప్పట్లో రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటి వరకు జానెడు భూమిని స్వా«దీనం చేసుకోలేదని ప్రత్యర్థి వర్గాలు విమర్శిస్తున్నాయి.  

కూటమిలో చీలికలు.. పేలికలు  
అధికార కూటమి ఏర్పడినప్పుడు మూడు పార్టీల సమన్వయంతో పని చేస్తామని ప్రకటించిన నేతలు, ఇప్పుడు ఎవరికి వారే రాజకీయ లెక్కలు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య అంతర్గత విభేదాలు, మన్నెమాల ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు, జనసేనలో కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నాలు.. ఇవన్నీ కలిపి చూస్తే కావలి కూటమిలో సమన్వయం కంటే ఆధిపత్య పోరే ఎక్కువైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కావలిలో కూటమి మూడు పార్టీల ఐక్యతగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఎవరి రాజకీయ పట్టు పెంచుకోవాలన్న లెక్కలతో కుతకుతలాడుతోందన్న చర్చ సాగుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement