అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ‘మాకు డబ్బులు బాగా అవసరం. మా తమ్ముడు, మరదలు విదేశాలకు వెళ్లాలి. నీ పేరు మీద ఉన్న ఆస్తులు విక్రయించి డబ్బులు తీసుకురా’ అంటూ భర్త, అత్తింటి వారు సాగిస్తున్న వేధింపులు తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దేవీనగర్ ప్రాంతంలో నివసి స్తున్న బొమ్మిన హరీష్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. భద్రా చలం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన నందిని (32)తో అతనికి 2016వ సంవత్సరంలో వివాహమైంది.
వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హరీష్ కొంత కాలం నుంచి పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని నందినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. అతని తమ్ముడు భార్గవ్, మరదలు ఉమా విదేశాలకు వెళ్లేందుకు డబ్బులు కావాలని.. ఆమె పేరు మీద ఉన్న ఆస్తులను విక్రయించి డబ్బులు తెస్తావా? లేదా? అంటూ హరీష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు నందినిపై వత్తిడి తెస్తున్నారు.
వారి వేధింపులు భరించలేని నందిని మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకూ పోలీసులు హరీష్ అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఆయన పేరు చెబితే వదిలెయ్యాలి!


