సాక్షి, కోనసీమ జిల్లా: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అల్లవరం మండలం ఓడలరేవులో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల మేరకు.. బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (22) ఓడలరేవులోని బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అనంతపురంలోని కియా కంపెనీలో శిక్షణ పొందుతున్న ప్రేమ్ కుమార్.. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సెలవుపై స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీ ఎదురుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ప్రేమ్ కుమార్ షాక్‌కు గురయ్యాడు.
ఈ సందర్బంగా అతడితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం. కరెంట్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, అతడి మృతదేహాన్ని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. కాగా, పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా జరిగిన ఈ ఘటన అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇదీ చదవండి: పవన్ ఫ్లెక్సీపై జనసేన, టీడీపీ నేతల మధ్య కొట్లాట


