చార్జిషీట్‌ను విడుదల చేస్తున్న కేటీఆర్. చిత్రంలో హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కేఆర్ సురేశ్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సూటిప్రశ్న
కేసీఆర్ రాజీనామాతో ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ఇచ్చింది
మా అధినేతే లేకపోతే రేవంత్‌కు సీఎం పదవి వచ్చేది కాదు
ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ సీఎంగా అసెంబ్లీకి వస్తారు
రాష్ట్ర సంపద కోసం కుక్కల్లా సీఎం, మంత్రుల కొట్లాట
చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తూ తెలంగాణ జలాల అప్పగింత
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జిషీట్ విడుదల
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్‌కు రాజీనామాలు కొత్త కాదని.. ఆయన రాజీనామాతోనే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు గుర్తుచేశారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవి ఉండేది కాదన్నారు. కేసీఆర్‌ను రాజీనామా చేయాలనే నైతిక అర్హత రేవంత్‌కు లేదన్నారు. కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్‌రెడ్డి లాంటి అర్భకుడికి తట్టుకొనే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మురికి మాటలు వినేందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ కచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తారన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఇతర నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్ 23 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం..
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ప్రజలకు నరకం చూపించిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని.. వెయ్యి రోజుల శని పాలన, ప్రజాపీడన అని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ లేదా పచ్చ కాంగ్రెస్ పాలన కనిపించడం లేదని.. లుచ్చా కాంగ్రెస్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు.
సంపాదన కోసం సీఎం, మంత్రుల కొట్లాట
ఎంగిలి విస్తరాకుల వద్ద కుక్కలు కొట్టుకున్నట్టుగా రాష్ట్ర సంపద కోసం సీఎం, మంత్రులు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్ స్థాయిలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను గురుదక్షిణగా అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి నష్టం చేసేలా ఉంది. ఎస్‌ఎల్‌బీసీ కూలిపోయినా, చెక్ డ్యామ్‌లు దెబ్బతిన్నా కేంద్ర సంస్థలు, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. రూ. 50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. యూరియా అడిగిన రైతులపై లాఠీచార్జి చేయడం, నీళ్లు అడిగితే తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. రైతు సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’అని కేటీఆర్ విమర్శించారు.
ఎంపీల కొడుకులపై యాక్సిడెంట్ల కేసుల నమోదులో వివక్ష
‘హైదరాబాద్‌లో పట్టపగలే హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మంత్రుల కుమారులు దౌర్జన్యాలకు పాల్పడినా, ఇతర పారీ్టల ఎంపీల కుమారులు ప్రమాదాలకు కారణమైనా కేసులు నమోదు చేయడంలో పోలీసులు వివక్ష చూపుతున్నారు. బొల్లారం మిలిటరీ స్థావరంపైనే దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ విద్యను అనుసంధానం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ అప్పగించిన రాష్ట్రాన్ని కుప్పకూల్చారు: హరీశ్‌రావు
కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన తెలంగాణను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూల్చుతోందని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతిభద్రతల వంటి రంగాల్లో గతంలో తెలంగాణ దేశా>నికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందితే ఇప్పుడు కరెంట్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మందులు కూడా దొరకని స్థితికి చేరింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్లపై హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే చార్జిషీట్ విడుదల చేశాం. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ఒత్తిడి పెంచేందుకు బీఆర్‌ఎస్ ప్రకటించిన పోరాటాన్ని ప్రజల పోరాటాన్ని కొనసాగిస్తాం’అని హరీశ్‌రావు ప్రకటించారు.


