న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ ‘ఖగంతక్–243’డ్రాప్ టెస్ట్‌ను భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజయవంతంగా నిర్వహించింది. కచ్చితమైన లక్ష్య ఛేదన సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయత్నాల్లో ఇదొక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ ఆయుధాన్ని భారతీయ రక్షణ రంగ సంస్థ ‘జేఎస్‌ఆర్ డైనమిక్స్’అభివృద్ధి చేసింది. డ్రాప్ టెస్ట్‌లో ఇది తన నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది.
అధునాతన సుదూర గగనతల ప్రయోగ ఆయుధాలను అభివృద్ధి చేసేందుకు భారతదేశం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఖగంతక్–243 ఒక భాగం. విమానం నుండి విడుదల చేసిన తర్వాత గ్లైడ్ బాంబులు తమ లక్ష్యం వైపు ప్రయాణించేలా రూపొందించారు. సాంప్రదాయ గ్రావిటీ బాంబులతో పోలిస్తే ఇవి ఎక్కువ దూరం నుంచి లక్ష్యాలను ఛేదిస్తాయి. ఖగంతక్–243 గ్లైడ్ బాంబ్ రాకతో స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు గొప్ప ఊతం లభించిందని వైమానిక దళం హర్షం వ్యక్తంచేసింది.


