తొలి మహిళా ‘టాప్‌ గన్‌’ పైలట్‌గా  భావనా కాంత్‌ రికార్డు  | Squadron Leader Bhawana Kanth Becomes IAF's First Woman Top Gun Pilot | Sakshi
Sakshi News home page

తొలి మహిళా ‘టాప్‌ గన్‌’ పైలట్‌గా  భావనా కాంత్‌ రికార్డు 

Aug 8 2026 6:08 AM | Updated on Aug 8 2026 11:44 AM

Squadron Leader Bhawana Kanth makes history as IAF 1st woman Top Gun pilot

న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్‌) లో స్క్వాడ్రన్‌ లీడర్‌ భావనా కాంత్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫైటర్‌ కంబాట్‌ లీడర్‌ (ఎఫ్‌సీఎల్‌) కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. వాయుసేనలో ‘టాప్‌ గన్‌’ప్రోగ్రామ్‌గా పరిగణించే ఈ కోర్సు ‘టాక్టిక్స్‌ అండ్‌ ఎయిర్‌ కాంబాట్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్మెంట్‌’నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రతి 100 మంది ఫైటర్‌ పైలట్స్‌లో ఒక్కరికి మాత్రమే దక్కే అత్యంత అధునాతన యుద్ధ విమానయాన శిక్షణ, ఫైటర్‌ కంబాట్‌ లీడర్‌ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. తొలి రన్‌వే రికార్డ్‌ నుంచి ఇప్పటివరకు ఆకాశ రికార్డులను తిరగరాస్తూనే ఉన్నారు. 

అత్యంత కఠినమైన శిక్షణ.. 
ఫైటర్‌ కంబాట్‌ లీడర్‌ (ఎఫ్‌సీఎల్‌) కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. అధికారికంగా స్ట్రైక్‌ ఫైటర్‌ టాక్టిక్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ప్రోగ్రామ్‌గా పిలిచే కోర్సులో, సిబ్బందికి అధునాతన పోరాట వ్యూహాలు, మిషన్‌ ప్రణాళిక, గగనతల నుంచి గగనతల, గగనతల నుంచి భూతల కార్యకలాపాలు, అధిక తీవ్రత గల కార్యాచరణ పరిస్థితుల్లో నాయకత్వం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. 

20 వారాల ఈ కార్యక్రమం ఐఏఎఫ్‌ అత్యంత కఠినమైన అధునాతన యుద్ధ కోర్సుల్లో ఒకటి. అమెరికా నేవీ నిర్వహించే ప్రసిద్ధ ’టాప్‌ గన్‌’ స్కూల్‌కు సమానమైన స్థాయిలో ఈ కోర్సుకు గుర్తింపు ఉంది. ఇందులో కొద్దిమంది ఫైటర్‌ పైలట్లకు మాత్రమే అవకాశం వస్తుంది. దీనిని పూర్తి చేసిన పైలట్లకు క్లిష్టమైన వైమానిక పోరాట మిషన్లకు నాయకత్వం వహించే అర్హత వస్తుంది. వైమానిక దళం అగ్రశ్రేణి యుద్ధ వ్యూహకర్తల్లో ఒకరిగా నిలుస్తారు. ఈ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా భావనా కాంత్‌ నిలిచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement