కాబూల్: పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నిన్న ( మంగళవారం) రాత్రి తాలిబన్ల భూభాగంపై పాక్ వైమానిక దాడులతో విరుచుకపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో అధికంగా చిన్నారులే ఉన్నట్లు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. చిన్నారులు నిద్రపోతున్న సమయంలో దాడులు చేయడంతో వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ దేశ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొద్ది కాలంగా అఫ్గానిస్థాన్- పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి ని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకున్నాయని పాక్ వైమానిక దళం విరుచుకపడింది. అయితే ఈ దాడిపై అఫ్గాన్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.
ఆయన మాట్లాడుతూ "నిన్న రాత్రి, పాకిస్తానీ సైన్యం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించి, కునార్, ఖోస్ట్ మరియు పక్తికా ప్రావిన్సులలోని పౌరుల ఇళ్లపై బాంబులు వేసింది. దీని ఫలితంగా 11 మంది పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మరణించారు.మరో 14 మంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు.బాధితులు నిద్రిస్తున్న సమయంలో రాత్రిపూట దాడులు జరిగాయి., దీంతో బాంబు దాడుల నుండి తప్పించుకోవడానికి వారికి ఏమాత్రం అవకాశం లభించలేదు. ఇది పూర్తిగా అమానవీయం" అని అన్నారు
అదే విధంగా గత కొద్దికాలంగా పాక్ దాడుల్లో మృతిచెందిన చిన్నారులతో కూడిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. కాగా పాక్ జరిగిన దాడుల్లో మెుత్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


