చెన్నైలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి
వెంటిలేటర్‌పై ఎనిమిదేళ్ల కుమారుడు
ఒంగోలు టౌన్: భార్య, భర్తల మధ్య మనస్పర్థలు కన్నబిడ్డల ప్రాణాల మీదకు తెచ్చాయి. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన తండ్రి కన్నబిడ్డలకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించాడు. పరిస్థితి విషమించి కుమార్తె మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన కొరిశపాటి విజయకుమార్, ప్రవల్లిక 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. కూతురు ఆద్య (10), కుమారుడు సుప్రీత్ (8) ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్నారు.
కొంతకాలంగా భార్య ప్రవల్లికపై అనుమానం పెంచుకున్న విజయకుమార్ ఆమెను వేధించసాగాడు. విసిగివేసారిన ప్రవల్లిక ఇంటినుంచి వెళ్లిపోయి ఒంగోలు శక్తిసదన్‌లో ఆశ్రయం పొందింది. నాలుగు నెలలుగా ఆమె అక్కడే ఉంటోంది. భార్య తన వద్దకు రాకపోవడంతో కక్ష పెంచుకున్న విజయకుమార్ ఈ నెల 19వ తేదీ ఆద్య, సుప్రీత్‌లకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించాడు. తరువాత ఏమీ తెలియనట్లు పిల్లలను తీసుకెళ్లి తల్లి దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. మరుసటి రోజు పిల్లలు వాంతి చేసుకోవడంతో అనుమానం వచ్చిన ప్రవల్లిక ఏం జరిగిందని ఆరా తీసింది.
నాన్న కూల్ డ్రింక్ తాగించినట్లు చెప్పారు. వాంతులు ఆగకపోవడంతో వెంటనే పిల్లలను జీజీహెచ్‌కు తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాయిజన్ తాగినట్లు నిర్ధారించారు. వెంటనే వారిని ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యం ప్రారంభించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్తె ఆద్య శనివారం మృతి చెందింది. కుమారుడు సుప్రీత్ ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే రెండు రోజుల కిత్రం తండ్రి విజయ్ కుమార్ కూడా ఎలుకల మందు తాగి ఆత్యహత్య ప్రయత్నం చేశాడు. అతడిని జీజీహెచ్‌కు తరలించారు. అప్పుడు ఈ విషయం బయట పడింది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


