ఎట్టకేలకు... కదలిన కృష్ణమ్మ | 21278 Cusecs Of Water Released From Narayanpur Dam | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు... కదలిన కృష్ణమ్మ

Jul 26 2026 6:08 AM | Updated on Jul 26 2026 6:08 AM

21278 Cusecs Of Water Released From Narayanpur Dam

నారాయణపూర్‌ డ్యాం నుంచి 21,278 క్యూసెక్కులు దిగువకు.. 

రేపు జూరాలకు చేరుకోనున్న కృష్ణమ్మ

వరద ఇదే రీతిలో కొనసాగితే ఆగస్టు మొదటి వారానికి శ్రీశైలానికి కృష్ణా ప్రవాహం  

ఆల్మట్టి డ్యాంలోకి 88,228 క్యూసెక్కుల ప్రవాహం

112.43 టీఎంసీలకు చేరిన నీటి నిల్ల

ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు  67,500 క్యూసెక్కులు విడుదల

సాక్షి, అమరావతి: ఎట్టకేలకు కృష్ణమ్మ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలను దాటి తెలుగు రాష్ట్రాల వైపు కదలివస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో శనివారం గేట్లు ఎత్తేశారు. గేట్ల ద్వారా, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్‌కు సోమవారం చేరనుంది. వరద ఇదే రీతిలో కొనసాగితే ఆగస్టు మొదటి వారానికి శ్రీశైలానికి 
కృష్ణమ్మ చేరుకోనుంది.  

మహారాష్ట్రలో వర్షాల వల్ల...
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో ఎగువన వర ద ప్రవాహం శనివారం ఒకింత పెరిగింది. ఆల్మట్టి డ్యాంలోకి 88,228 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 112.43 టీఎంసీలకు చేరుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ముంపు ముప్పు తప్పించడానికి కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 42,500 క్యూసెక్కులు, వెరసి 67,500 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. దాంతో నారాయణపూర్‌ డ్యాంలోకి 66,692 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.

నీటి నిల్వ గరిష్టస్థాయికి చేరుకోవడంతో నారాయణపూర్‌ డ్యాం గేట్లు ఎత్తి 15,278 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 6వేల క్యూసెక్కులు, వెరసి 21,278 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ ప్రవాహం సోమవారానికి జూరాలకు చేరుకోనుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది బీమాపై మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయిని డ్యాంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి 900 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణాకు బీమా ప్రవాహం తోడైతే జూరాల నుంచి శ్రీశైలానికి ఆగస్టు మొదటి వారం కంటే ముందుగానే వరద చేరే అవకాశం ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement