ఘటనాస్థలంలో బోల్తాపడిన ట్రాక్టర్
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో దుర్ఘటన
పొలాల్లోకి బోల్తా కొట్టిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
టీడీపీ ఎమ్మెల్యే అండతో వాగుల్లో మట్టి కొల్లగొడుతున్న సిండికేట్
పెదనందిపాడు: టీడీపీ కూటమి నేతల మట్టి మాఫియాకు మరో డ్రైవర్ బలయ్యాడు. కూలి కోసం, కుటుంబం గడవడం కోసం మట్టి సిండికేట్ ఇచ్చే డబ్బులకు ఆశపడి పగలూరాత్రీ పని చేస్తున్న డ్రైవర్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకులగుంటలో మంగళవారం టిప్పర్ డ్రైవర్ మరణించిన విషయం మరువకముందే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో శనివారం మరో డ్రైవర్ అసువులుబాశాడు. ఈ దుర్ఘటనలు మట్టిమాఫియా అరాచకాలకు అద్దం పడుతున్నాయి.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామ పరిధిలోని ఉన్న నల్లమడ వాగులో అక్రమంగా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బాపట్ల జిల్లా, పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రావి సతీష్ (36) ఇక్కడ కొన్నాళ్లుగా మట్టి రవాణా చేస్తున్నాడు. పగలూరాత్రీ పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని సిండికేట్ ఆశ పెట్టడంతో మట్టి తోలుతున్నాడు.
శుక్రవారం అర్ధరాత్రి మట్టి తరలిస్తుండగా వేకువజామున 3 గంటలకు నాగులపాడు సమీపంలోని నల్లమడవాగు బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనున్న పొలాల్లోకి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సతీ‹Ùకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ దుర్ఘటనతో మట్టి సిండికేట్ సభ్యులు నల్లమడ వాగు వద్ద ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లను వెంటనే తరలించేశారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
టీడీపీ ఎమ్మెల్యే బూర్ల అండతోనే.. !
ఇదిలా ఉంటే పెదనందిపాడు మండలంలోని ఓగేరువాడు, నల్లమడ వాగు, నక్కవాడు, మేకల వాగుల్లో యథేచ్ఛగా మట్టి మాఫియా తవ్వకాలకు పాల్పడుతోంది. ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అండతో చెలరేగిపోతోంది. పొలాల మెరక కోసం అంటూ రైతుల ముసుగులో మట్టిని యథేచ్ఛగా తవ్వేసి ట్రక్కు మట్టి రూ.800 నుంచి రూ.1,200 వరకు అమ్మి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం చీరాలలోని డ్రెయినేజీ అధికారులకూ మామూళ్లు సమరి్పంచినట్టు తెలుగుదేశం కూటమి నేతలు బాహాటంగానే చెబుతున్నారు.


