28న నిరసన ర్యాలీలు భారీగా నిర్వహించాలి | Sajjala calls for massive protests on july 28th | Sakshi
Sakshi News home page

28న నిరసన ర్యాలీలు భారీగా నిర్వహించాలి

Jul 26 2026 2:28 AM | Updated on Jul 26 2026 4:47 AM

Sajjala calls for massive protests on july 28th

విద్యార్థులు, యువత, డీఎస్సీ అభ్యర్థులను భాగస్వాములను చేయాలి 

వైఎస్సార్‌సీపీ యువజన విభాగాలకు పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచన

సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలు, విద్యార్థులు, యువతకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దగాకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఈనెల 28న తలపెట్టిన ర్యాలీలు పక్కా వ్యూహంతో సాగాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులకు పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి దిశా నిర్దేశం చేశారు. పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీట్‌ అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

దీంతో పాటు రూ. 10 వేల కోట్లకు పైగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చకపోవడంపైనా నిరసన తెలపాలని చెప్పారు. పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, యువజన సంఘాలను కలుపుకొని ప్రతి జిల్లాలో వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనాలని అన్నారు.

 ఆదివారం రోజే విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, కాలేజీలలో చిన్న చిన్న గ్రూప్‌ మీటింగ్‌లు నిర్వహించి, వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా, ప్రెస్‌ కాన్ఫరెన్సుల ద్వారా నిరసన పిలుపును విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సీజేపీ నిరసన కార్యక్రమాల స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement