పంచదార్ల కొండను తవ్వేస్తున్న సీఎం రమేష్ అండ్ కో
అల్లుడు విజయ్ పేరుతో 7 హెక్టార్లలో భారీ తవ్వకాలు
రెండు నెలల్లోనే ఏకంగా 2 లక్షల టన్నుల గ్రావెల్ తరలింపు
అక్రమంగా తరలించిన గ్రావెల్ విలువ రూ.10 కోట్లకు పైనే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శైవ క్షేత్రమైన పంచదార్ల కొండకు గుండుకొడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అల్లుడు పేరుతో గిల్లుడు వ్యవహారం నడిపారు. ఏకంగా రెండు మైనింగ్ లీజుల ద్వారా 2 లక్షల టన్నుల గ్రావెల్‌ను అదనంగా ‘విజయ’వంతంగా అక్రమ తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ శాఖ సర్వేలో తేల్చింది. దీని విలువ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి మార్కెట్లో దీని ధర రూ. 10 కోట్లకు పైనే ఉంటుందని మైనింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ సీఎం రమేష్‌కు అల్లుడి వరుసైన విజయకుమార్ నాయుడు పేరుతో రెండు చోట్ల లీజులు తీసుకున్నారు.
విజయ్‌కుమార్ నాయుడు సీఎం రమేష్ సొంత ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు చెందినవాడు. ఒకచోట 2.153 హెక్టార్లు, మరో చోట 4.99 హెక్టార్లు.. మొత్తం 7.143 హెక్టార్లలో మైనింగ్ అనుమతులు జారీ చేశారు. ఆపై రేయింబవళ్లు తవ్వకాలతో రెండు నెలల్లోనే లీజుకు మించి అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన పంచదార్ల శైవ క్షేత్రంలో స్వయంభూ లింగం ఉండేది. యమ ధర్మరాజు తన కుష్ఠు వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివ లింగాన్ని పునఃప్రతిష్ట చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఈ శైవ క్షేత్రంలో నిరంతరాయంగా లింగాల నుంచి పారే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండటంతో పాటు అనారోగ్యం పాలుకాకుండా కాపాడుతుందని భక్తుల విశ్వాసం.
అదేవిధంగా నరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదాలు మోపారని కూడా చరిత్ర చెబుతోంది. ఈ శైవ క్షేత్రాన్ని పురావస్తు శాఖ పురాతన కట్టడంగా గుర్తించింది. ఇటువంటి పంచదార్ల కొండపై ఎంపీ సీఎం రమేష్ కన్ను పడింది. ఇందుకు అనుగుణంగా అల్లుడి పేరుపై మైనింగ్ లీజుతో నాటకానికి తెరలేపారు. రాత్రి, పగలు తేడా లేకుండా రెండు నెలలుగా అక్రమంగా లీజు అనుమతికి మించి అదనంగా తవ్వకాలు చేపట్టారు.
విజయ్‌కుమార్ నాయుడు పేరుతో తీసుకున్న రెండు మైనింగ్ అనుమతుల ద్వారా.. ఒక దాని నుంచి 1,39,000 టన్నులు, మరో దాంట్లో మరో 63 వేల టన్నులు అక్రమంగా తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ సర్వేలో తేలింది. అక్రమంగా తవ్విన గ్రావెల్‌ను సమీపంలో పనులు చేస్తున్న సీఎం రమేష్‌కు చెందిన రితి్వక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు సరఫరా చేస్తున్నారు. తద్వారా అంతిమంగా లబ్ధి పొందుతోంది సీఎం రమేష్ అని స్పష్టమవుతోంది.


