breaking news
Panchadarla
-
పంచదార్లకొండ మైనింగ్ లీజుల వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, పంచదార్లకొండను గుల్ల చేస్తూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సోమవారం స్పందించింది. పంచదార్లకొండ వద్ద మైనింగ్‌కు సంబంధించిన జారీ చేసిన లీజుల వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లకొండ వద్ద కూటమి ప్రభుత్వ పెద్దలకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ అక్రమ మైనింగ్ చేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించడంతో పాటు ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారంటూ శ్రీపంచదార్ల ధర్మలింగేశ్వరస్వామి దేవస్థానం పూర్వ చైర్మన్ ఉప్పులూరి నాయుడు పిల్ దాఖలు చేశారు.ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పంచదార్లకొండ రక్షిత జోన్లో ఉంది. ఇక్కడ ఎలాంటి మైనింగ్ చేయడానికి వీల్లేదు. యమధర్మరాజు ప్రతిష్టించిన శివలింగానికి అక్రమ మైనింగ్ వల్ల ప్రమాదం ఏర్పడింది. అధికార పార్టీలకు చెందిన నేతలు కొందరు పంచదార్లకొండను అక్రమ మైనింగ్ ద్వారా గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎగవేసిన పన్నులు, రాయల్టీ, సీనరేజీ, డెడ్‌రెంట్ వంటి వాటిని అక్రమ మైనింగ్‌దారుల నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న విజయ్ కుమార్ నాయుడు, రితి్వక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ లైసెన్సులను రద్దు చేయాలి’ అని విన్నవించారు. పంచదార్లకొండపై 2.13 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించామని, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించామని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలుపుతుండగా, పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ‘మొత్తం మూడు మైనింగ్ లీజులున్నాయి. ఒకటి కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీ పేరు మీద, మరొకటి ఆయన డ్రైవర్ పేరు మీద, మరొకటి ఇతర పేరు మీద ఉంది. ఈ మూడింటిలో ఒక లైసెన్సును మాత్రమే రద్దు చేశారు. మిగిలిన వాటి గురించి ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు’ అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. -
‘పంచదార్ల’ను వదలని మైనింగ్ మాఫియా
సాక్షి, అనకాపల్లి: పవిత్ర పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ ఆగడం లేదు. ప్రభుత్వం జీవో జారీ చేసి 48 గంటలు కూడా గడవక ముందే అక్రమార్కులు మళ్లీ భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన పంచదార్ల కొండపై రెండు నెలలుగా కూటమి నేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం.. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం తెలిసిందే. ఈ దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడం.. వైఎస్సార్సీపీ ఢిల్లీ దాకా ఉద్యమించడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈ నెల 27న పంచదార్ల కొండను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ జీవో 226 జారీ చేసింది.అయితే, ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం అక్రమార్కులు లెక్కచేయడం లేదు. జీవో వచ్చిన రెండు రోజుల్లోనే, స్థానిక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బంధువు మైనింగ్ చేస్తున్న ప్రాంతానికి పక్కనే శనివారం మళ్లీ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టినట్లు స్థానిక ప్రజలు వెల్లడించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ముసుగులో, పారిశ్రామిక పార్కు పేరుతో మైనింగ్ శాఖ కనీస అనుమతులు కూడా లేకుండా రెండు నెలలుగా రాత్రి, పగలు తేడా లేకుండా 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్‌ను తవ్వేశారు. ప్రశ్నించిన వారిని లారీలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగంపై సాక్షి, వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం దిగొచ్చి జీవో జారీ చేసినా, స్థానిక మాఫియా దానిని ఏ మాత్రం ఖాతరు చేయక పోవడం గమనార్హం. దీనిపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, పోలీసు శాఖ అధికారులు తక్షణం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
విజయవాడ: వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం దొగొచ్చింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 153 హెక్టార్ల పరిధిని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది. పంచదార్ల కొండను కూటమి నేతలు తవ్వేసిన విషయం తెలిసిందే. చారిత్రక పంచదారలను కూటమి నేతలు ధ్వంసం చేశారు. కూటమి నేతల అక్రమ మైనింగ్ పై వైసీపీ పోరాటం చేసింది. వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లను నోమైనింగ్ జోన్‌గా చేపట్టాలని వైఎస్సార్సీపీ చాలా కాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. లేదంటే మరింత పెద్దఎత్తున పోరాటం చేపడతామని సర్కారు హెచ్చరించింది. దీంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గి నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు -
పంచదారలను కాపాడాలి.. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: అనకాపల్లిలో పంచదారల కొండలను పరిరక్షించాలి రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. పంచదారల వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలన్నారు. పంచదారల కొండలలో జరిగిన మైనింగ్‌పై వెంటనే విచారణ జరగాలని కేంద్రాన్ని ఆయన కోరారు. పవిత్ర, చారిత్రక, పర్యావరణ సున్నిత ప్రాంతాలను ‘నో మైనింగ్ జోన్’లుగా గుర్తించాలన్నారు.రాజ్యసభలో మైన్స్ అండ్ మినరల్స్ బిల్లు పై చర్చ జరిగింది. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘అనకాపల్లిలో పంచదారల కొండను పరిరక్షించాలి. పంచదారలను మైనింగ్-ఫ్రీ హెరిటేజ్ జోన్‌గా ప్రకటించాలి. పంచదారల వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత ప్రాంతం ఇది. పంచదారల హిల్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ కొండపై ఏఎస్ఐ రక్షిత ధన దిబ్బలు బౌద్ధ సైట్, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి 90-200 మీటర్ల దూరంలోనే క్వారీలు జరుగుతున్నాయి. 2024–2025 శాటిలైట్ చిత్రాలు వారసత్వ జోన్ వైపు క్వారీలు వేగంగా ముందుకు సాగుతున్నట్లు చూపిస్తున్నాయి.బ్లాస్టింగ్, తవ్వకాల వల్ల నీటి వనరులు, భూగర్భ జలాలు, కొండ స్థిరత్వం ప్రమాదంలో పడిపోయింది. వెంటనే సమగ్ర పర్యావరణ అంచనా, హైడ్రోజియోలాజికల్ స్టడీ, మైనింగ్ నిలిపివేత, ‘మైనింగ్-ఫ్రీ హెరిటేజ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. 2019–2024లో ఏపీఎండీసీ ద్వారా ఆన్లైన్ బుకింగ్, స్థిర ధరలతో సంవత్సరానికి సుమారు ₹765 కోట్లు (5 ఏళ్లలో ₹3,825 కోట్లు) రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ప్రస్తుత ‘ఫ్రీ ఇసుక’ విధానంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా కోల్పోయి, కృష్ణ, పెన్నా నదుల్లో అక్రమ తవ్వకాలు, చేతిరాత స్లిప్‌లు, క్యూఆర్ కోడ్లతో అనధికారిక వసూళ్లు, నదీతీరాలు, భూగర్భ జలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.పవిత్ర, చారిత్రక, పర్యావరణ సున్నిత ప్రాంతాలను ‘నో మైనింగ్ జోన్’లు గుర్తించాలి. రాష్ట్రవ్యాప్త డిజిటల్ ట్రేసబిలిటీ అండ్ బుకింగ్ వ్యవస్థ రావాలి. మైనింగ్ అనుమతులను నీటి భద్రత, స్థానిక హైడ్రాలజీకి అనుసంధానం చేయాలి. ఫెడరల్ రక్షణలు, రాష్ట్ర ఆదాయాలు, పర్యావరణ వారసత్వం రాజీ లేకుండా కాపాడాలి అని వ్యాఖ్యానించారు. -
మంత్రి సహకారంతో పంచదర్లలో అక్రమ మైనింగ్.. ఆ మంత్రి పేరు...
-
అల్లుడు పేరుతో గిల్లుడు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శైవ క్షేత్రమైన పంచదార్ల కొండకు గుండుకొడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అల్లుడు పేరుతో గిల్లుడు వ్యవహారం నడిపారు. ఏకంగా రెండు మైనింగ్ లీజుల ద్వారా 2 లక్షల టన్నుల గ్రావెల్‌ను అదనంగా ‘విజయ’వంతంగా అక్రమ తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ శాఖ సర్వేలో తేల్చింది. దీని విలువ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి మార్కెట్లో దీని ధర రూ. 10 కోట్లకు పైనే ఉంటుందని మైనింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ సీఎం రమేష్‌కు అల్లుడి వరుసైన విజయకుమార్ నాయుడు పేరుతో రెండు చోట్ల లీజులు తీసుకున్నారు.విజయ్‌కుమార్ నాయుడు సీఎం రమేష్ సొంత ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు చెందినవాడు. ఒకచోట 2.153 హెక్టార్లు, మరో చోట 4.99 హెక్టార్లు.. మొత్తం 7.143 హెక్టార్లలో మైనింగ్ అనుమతులు జారీ చేశారు. ఆపై రేయింబవళ్లు తవ్వకాలతో రెండు నెలల్లోనే లీజుకు మించి అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన పంచదార్ల శైవ క్షేత్రంలో స్వయంభూ లింగం ఉండేది. యమ ధర్మరాజు తన కుష్ఠు వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివ లింగాన్ని పునఃప్రతిష్ట చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఈ శైవ క్షేత్రంలో నిరంతరాయంగా లింగాల నుంచి పారే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండటంతో పాటు అనారోగ్యం పాలుకాకుండా కాపాడుతుందని భక్తుల విశ్వాసం. అదేవిధంగా నరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదాలు మోపారని కూడా చరిత్ర చెబుతోంది. ఈ శైవ క్షేత్రాన్ని పురావస్తు శాఖ పురాతన కట్టడంగా గుర్తించింది. ఇటువంటి పంచదార్ల కొండపై ఎంపీ సీఎం రమేష్ కన్ను పడింది. ఇందుకు అనుగుణంగా అల్లుడి పేరుపై మైనింగ్ లీజుతో నాటకానికి తెరలేపారు. రాత్రి, పగలు తేడా లేకుండా రెండు నెలలుగా అక్రమంగా లీజు అనుమతికి మించి అదనంగా తవ్వకాలు చేపట్టారు. విజయ్‌కుమార్ నాయుడు పేరుతో తీసుకున్న రెండు మైనింగ్ అనుమతుల ద్వారా.. ఒక దాని నుంచి 1,39,000 టన్నులు, మరో దాంట్లో మరో 63 వేల టన్నులు అక్రమంగా తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ సర్వేలో తేలింది. అక్రమంగా తవ్విన గ్రావెల్‌ను సమీపంలో పనులు చేస్తున్న సీఎం రమేష్‌కు చెందిన రితి్వక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు సరఫరా చేస్తున్నారు. తద్వారా అంతిమంగా లబ్ధి పొందుతోంది సీఎం రమేష్ అని స్పష్టమవుతోంది. -
‘పంచదార్ల’ను కాపాడండి.. కేంద్రానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి
ఢిల్లీ: అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండల్లో మైనింగ్‌ను వెంటనే అరికట్టి, అక్కడి వారసత్వ సంపదను కాపాడాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ ఎం.గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం సమర్పించిన ఆయన, చారిత్రక బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపి వేయించాలని, ఆ మొత్తం పంచదార్ల కొండ ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు.ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు స్థలం శాతవాహన కాలానికి చెందిన అత్యంత ప్రాచీన వారసత్వ కట్టడం అని, అది భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) రక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందిందని ఎంపీ గురుమూర్తి గుర్తు చేశారు. అలాగే పంచదార్లలోని శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయమని తెలిపారు. ఈ రెండు చారిత్రక వారసత్వ కట్టడాల సమీపంలో మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగడం వల్ల పురావస్తు సంపదకు, సహజ వాతావరణానికి, శాశ్వత జలధారలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ క్షేత్రానికి సుమారు 90 మీటర్లు, 190 మీటర్లు, 200 మీటర్ల దూరంలో మైనింగ్ జరుగుతోందని, ఉపగ్రహ చిత్రాలతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలనల్లో కూడా ఆ విషయం తెలిందని, ఇంకా మైనింగ్ కొనసాగితే, అది పురావస్తు సంరక్షణ చట్టాల ఉల్లంఘన అవుతుందని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో పురావస్తు శాఖతో తక్షణ క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని, మైనింగ్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, నిపుణులతో కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పంచదార్ల మొత్తం ప్రాంతాన్ని ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కోరారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం.. పంచదార్ల నో మైనింగ్ జోన్
సాక్షి, అనకాపల్లి: అక్రమమైనింగ్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్మపోరాటానికి కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. పంచదార్లను నోమైనింగ్ జోన్‌గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. మైనింగ్ సంస్థ ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఎస్టాబ్లిష్మెంట్ ఆపరేషన్ తక్షణమే రద్దు చేయాలని తెలిపింది. పంచదార్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించింది.మరోవైపు పంచదార్లను నోమైనింగ్ జోన్‌గా చేపట్టాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. లేకుంటే పెద్దఎత్తున పోరాటం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వైఎస్సార్సీపీ హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గి పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
‘పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించే వరకూ ఉద్యమిస్తాం’
పంచదార్ల: అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో తవ్వకాలు దారుణమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి దేవుడంటే భయం లేదని, తవ్వకాలు ఆపకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు కన్నబాబు. పంచదార్లలో మైనింగ్ అక్రమాలపై మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. సంపద సృష్టి అంటే విధ్వంసమా అని ప్రశ్నించారు. ‘మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. చంపేస్తామని బెదిరిస్తే బెదిరేది లేదు. ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుంది. పంచదార్లను చూస్తుంటే కేజీఎఫ్ గుర్తుకు వస్తుంది. సింగరేణి గనుల్లా తవ్వేశారు. ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. పంచదార్లలో మైనింగ్ చేసే వారిపై కేసులు పెడుతున్నారా? లేదా?, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను భయపెట్టి బతుకుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పేవాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా జీవో ఇచ్చేవరకూ ఉద్యమిస్తాం. పంచదార్ల కొండపై అమరలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. శివుడు మూడో కన్ను తెరిస్తే కూటమి భస్మం అవుతుంది. పంచదార్ల కొండపై తట్ట మట్టి తీయండి.. పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారు. ఇంతటితో వదలం.. లక్షలాది మందిని పంచదార్లకు తీసుకొస్తాం’ అని హెచ్చరించారు. -
టీడీపీ నేతల అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ పోరాటం
సాక్షి, అనకాపల్లి జిల్లా: కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ అరాచకంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ ఇవాళ (మంగళవారం) చలో పంచదార్ల’ పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. వేలాది బైకులు, వందలాది కార్లతో వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచదార్ల కొండలను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారుయలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమబాటలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం: బొత్సఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం చేస్తున్నామన్నారు. పంచదార్ల కొండలను దోపిడీ చేస్తున్నారు. ప్రజా ఉద్యమంలా మారకుండా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమ మైనింగ్ ఆపకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలని మీడియాను మొత్తం తీసుకువచ్చాంఅక్రమ మైనింగ్‌కు పాల్పడేది చిన్న వ్యక్తులు కాదు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కలిపి దోచుకుంటున్నారు. రోజు సనాతన ధర్మం అంటారు, ఎక్కడ ఉంది మీ సనాతన ధర్మం. మీకు కళ్లు ఉంటే కూటమి పెద్దలు వచ్చి అక్రమ మైనింగ్ చూడండి. పంచదార్ల కొండ కోసం మేము పోరాటం చేస్తుంటే కుట్ర దాగి ఉందని మాట్లాడతారా?. ఏమి కుట్ర దాగి ఉందో కూటమి నేతలు చెప్పాలి. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలియదు. పాపం కూటమి నేతలకు తగులుతుంది. రేపు ఉదయం మైనింగ్ వాహనాలు పంచదార్ల కొండపై ఉండకూడదు. ఉంటే నడిరోడ్డుపై ధర్నా చేస్తాం’’ అని బొత్స హెచ్చరించారు. -
కొండల్ని కొల్లగొడుతున్నారు.. సీఎం రమేష్‌పై అమర్నాథ్ ఫైర్
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ఎంపీ సీఎం రమేష్, ఆయన అనుచరులు పంచదార్ల కొండలను దోచుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇలా అక్రమ సంపాదనతో ప్రత్యేక విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా మంగళవారం ఛలో పంచదారల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. అక్రమ సీఎం సంపాదనతో సీఎం రమేష్ విమానాలు, ఎన్నికల్లో సీట్లు కొంటున్నారు. ఒక వైపు పంచదార్ల కొండలను.. మరోవైపు సింహాచలం కొండలను ధ్వంసం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా పురాతన ఆలయానికి నష్టం జరుగుతుందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.కొండపై ఇచ్చిన అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. సీఎం రమేష్, ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ వల్ల పంచదార్లలో ఒక దారలో బురద వస్తుంది. వందల ఏళ్ళ నుంచి పంచదార్ల ఉమ ధర్మ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రవహిస్తున్నాయి.మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
రంగంలోకి దిగనున్న జగన్... విశాఖలో మహాధర్నా
-
‘కూటమి నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారు’
సాక్షి, యలమంచిలి: కూటమి పాలనలో దోపిడీకి హద్దు లేకుండాపోతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లాల్లో పంచ భూతాలను ఎంపీ సీఎం రమేష్ దోచుకుంటున్నారని అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు అంటూ మండిపడ్డారు.అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలిలో పంచదారల కొండపై అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. వారి రిలే దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రిలే నిరాహార దీక్షను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఎంపీ సీఎం రమేష్ దోపీడీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కొండలను పిండి చేస్తున్నారు. వందల లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. పవిత్రమైన పంచదార్ల కొండను మింగేస్తున్నారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమైపోయారు?. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన పంచదార కొండను ధ్వంసం చేస్తున్నారు. ఈ పాపానికి పవన్ కళ్యాణ్ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు?’ అని ప్రశ్నించారు.కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్లు దోపిడీకి కూటమి నేతలు పాల్పడుతున్నారు. కొండలను మాయం చేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కల్పిస్తున్నారు. కడప నుంచి సీఎం రమేష్ ప్రజా సేవకు వచ్చారు అనుకున్నాం. వారి కంపెనీల పేరు మీద పర్మిట్లతో కొండలను మింగేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు తెల్లవారితే ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయానికి గుండు కొడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తాం. ఈ నెల 21వ తేదీన చలో పంచదార్ల కార్యక్రమం నిర్వహిస్తాం. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. మైనింగ్ లీజులు సోమవారం లోపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి దాడి శెట్టి రాజా మాట్లాడుతూ..‘మహా పవిత్రమైనవి పంచదార్ల కొండలు. ఈ కొండ గురించి మహా భారతంలో ప్రస్తావన ఉంది. చోళుల కాలంలో ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ సనాతన వాదులకు కనిపించలేదా?. సంపద సృష్టి పేరుతో వారసత్వ సంపదను దోచుకుంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్ర సంపాదనను దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘పంచదార్ల కొండపై కూటమి అనకొండలు పడ్డాయి. కొండలను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ గద్దల్లా దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 30 కిలో మీటర్ల పరిధిలో పంచదార్ల కొండలు విస్తరించి ఉన్నాయి. ప్రజలకు జీవనాధారం ఈ కొండలు’ అని చెప్పుకొచ్చారు. -
పోటెత్తిన పంచదార్ల
రాంబిల్లి: జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మూడో సోమవారం పురస్కరించుకుని ఆలయాల్లో పెద్ద ఎత్తున బారులు తీరారు. పలువురు ఉపవాస దీక్షలు పాటించారు. ప్రముఖ ఫుణ్యక్షేత్రం పంచదార్ల శివనామ స్మరణంతో మార్మోగింది. జిల్లా నలు మూలలు నుంచి సుమారు 30 వేల మంది ఇక్కడి కాశీ విశ్వేశ్వరస్వామి, సహస్ర లింగేశ్వరస్వామి, రాధా మాధవ స్వామిలను దర్శించుకొని తరించారు. తొలుత ఇక్కడి పవిత్రమైన ఆకాశధారతో పాటు మరో నాలుగు పుణ్యధారల వద్ద భక్తులు స్నానాలు ఆచరించారు. అనంతరం క్షేత్ర పాలకుడు ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశ ధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించడానికి, ఉమా ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు గంటల తరబడి బారులు తీరారు. వేలాది మంది రాకతో సందడిగా మారింది. పలు ప్రాంతాలు నుంచి వచ్చిన వారు ఇక్కడ పిక్నిక్లు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు. ఎస్ఐ కె. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చోడవరం మండలం గోవాడ శివాలయం, రాయపురాజుపేట శివ పంచాయతన ఆలయం, వెంకన్నపాలెం కాశీవిశ్వేశ్వరాలయం, జుత్తాడ ఉమా మల్లికార్జున ఆలయం, భోగాపురం భోగలింగేశ్వరుని ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారు జాము నుంచి పూజలు చేశారు.


