పంచదార్ల: అనకాపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్లలో తవ్వకాలు దారుణమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి దేవుడంటే భయం లేదని, తవ్వకాలు ఆపకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు కన్నబాబు.
పంచదార్లలో మైనింగ్ అక్రమాలపై మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. సంపద సృష్టి అంటే విధ్వంసమా అని ప్రశ్నించారు. ‘మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. చంపేస్తామని బెదిరిస్తే బెదిరేది లేదు. ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుంది. పంచదార్లను చూస్తుంటే కేజీఎఫ్ గుర్తుకు వస్తుంది. సింగరేణి గనుల్లా తవ్వేశారు. ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు.
పంచదార్లలో మైనింగ్ చేసే వారిపై కేసులు పెడుతున్నారా? లేదా?, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలను భయపెట్టి బతుకుతున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పేవాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. పంచదార్లను నో మైనింగ్ జోన్‌గా జీవో ఇచ్చేవరకూ ఉద్యమిస్తాం. పంచదార్ల కొండపై అమరలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. శివుడు మూడో కన్ను తెరిస్తే కూటమి భస్మం అవుతుంది. పంచదార్ల కొండపై తట్ట మట్టి తీయండి.. పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారు. ఇంతటితో వదలం.. లక్షలాది మందిని పంచదార్లకు తీసుకొస్తాం’ అని హెచ్చరించారు.


