తాడేపల్లి : వచ్చే నెల 9వ తేదీన విజయవాడలో వైఎస్సార్‌సీపీ బీసీ రణభేరి నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఈ రణభేరిలో బీసీలపై చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు చర్చిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ బీసీ నేతలను ఈ ప్రభుత్వం వేధిస్తుందని, చంద్రబాబు బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు జోగి రమేష్. బీసీల ఐక్యత చాటేలా ఈ రణభేరి ఉంటుందన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో బలహీన వర్గాలు నడవాల్సిన అవసరం ఉందన్నారు.
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం(జూలై 23వ తేదీన) మీడియా సమావేశంలో మాట్లాడిన జోగి రమేష్.. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారన్నారు. సామాజిక న్యాయం జగన్‌తోనే సాధ్యమని, ఆయన మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే టైం దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు జోగి రమేష్.
సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసం చేశారు
చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసం చేశారని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా బీసీలతో ఓట్లేయించుకుని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ‘ బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అన్నమాటలు ఎవరూ మర్చిపోలేదు. వైఎస్సార్ సీపీలోని బీసీ నేతలందరినీ టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. గంటూరులోనూ బీసీ మహిళను వివస్త్రతను చేసి అవమానపరిచారు. నాపై పది అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఇలాంటివి ఎన్నైనా ఎదుర్కొంటాం. బీసీలందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.


