కలకలం రేపిన సగం కాలిన మృతదేహం.. | An Incident That Caused A Sensation In Kothapalem Vishakapatnam | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన సగం కాలిన మృతదేహం..

Jul 23 2026 12:31 PM | Updated on Jul 23 2026 12:37 PM

An Incident That Caused A Sensation In Kothapalem Vishakapatnam

కొత్తపాలెంలో సంచలనంగా మారిన ఘటన

విశాఖపట్నం: గోపాలపట్నం, కొత్తపాలెంలోని పులగానిపాలెం పాత ఊరు సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటాక నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహం ఘటన బుధవారం కలకలం రేపింది. గుర్తుతెలియని, సుమారు 35–40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం సగం కాలి, చెట్టు కింద పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి వీఆర్‌వో సుబ్బారావుకు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐలు మారయ్య, రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద కాలిపోయిన మొబైల్‌, కళ్లజోడు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వేలిముద్రలను కూడా సేకరించారు. అనంతరం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ మృతుడు ట్రాక్‌ ప్యాంటు, రౌండ్‌ నెక్‌ టీషర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పరిస్థితిని బట్టి ఘటన మంగళవారం రాత్రి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.

మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, వేరే చోట హత్య చేసి, ఆధారాలు చెరిపివేసేందుకు ఇక్కడ కాల్చి ఉండొచ్చన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుడి గుర్తింపుతో పాటు ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు మొబైల్‌ ఫోన్‌ ఆధారాలు, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఆర్‌వో సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

మద్యం, గంజాయి కార్యకలాపాలకు అడ్డా
ఘటన జరిగిన పులగానిపాలెం పాత ఊరు–రైల్వే కల్వర్టు పరిసర ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ తరచూ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి రావాలంటే స్థానికులు కూడా భయపడే పరిస్థితి ఉందన్నారు. పోలీసుల నిఘాను మరింత పెంచాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement