చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
రేపటికి తదుపరి విచారణ వాయిదా
అక్రమ మైనింగ్‌తో ఖజానాకు కోట్ల నష్టం.. పర్యావరణానికి విఘాతం
ధర్మాసనానికి విన్నవించిన పొన్నవోలు
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా, పంచదార్లకొండను గుల్ల చేస్తూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు సోమవారం స్పందించింది. పంచదార్లకొండ వద్ద మైనింగ్‌కు సంబంధించిన జారీ చేసిన లీజుల వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పంచదార్లకొండ వద్ద కూటమి ప్రభుత్వ పెద్దలకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ అక్రమ మైనింగ్ చేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించడంతో పాటు ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారంటూ శ్రీపంచదార్ల ధర్మలింగేశ్వరస్వామి దేవస్థానం పూర్వ చైర్మన్ ఉప్పులూరి నాయుడు పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పంచదార్లకొండ రక్షిత జోన్‌లో ఉంది. ఇక్కడ ఎలాంటి మైనింగ్ చేయడానికి వీల్లేదు. యమధర్మరాజు ప్రతిష్టించిన శివలింగానికి అక్రమ మైనింగ్ వల్ల ప్రమాదం ఏర్పడింది. అధికార పార్టీలకు చెందిన నేతలు కొందరు పంచదార్లకొండను అక్రమ మైనింగ్ ద్వారా గుల్ల చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎగవేసిన పన్నులు, రాయల్టీ, సీనరేజీ, డెడ్‌రెంట్ వంటి వాటిని అక్రమ మైనింగ్‌దారుల నుంచి వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి.
అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న విజయ్ కుమార్ నాయుడు, రితి్వక్ ప్రాజెక్ట్స్, లక్ష్మీనరసింహ మినరల్స్ లైసెన్సులను రద్దు చేయాలి’ అని విన్నవించారు. పంచదార్లకొండపై 2.13 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలపై నిషేధం విధించామని, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించామని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలుపుతుండగా, పొన్నవోలు జోక్యం చేసుకుంటూ, ‘మొత్తం మూడు మైనింగ్ లీజులున్నాయి. ఒకటి కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీ పేరు మీద, మరొకటి ఆయన డ్రైవర్ పేరు మీద, మరొకటి ఇతర పేరు మీద ఉంది. ఈ మూడింటిలో ఒక లైసెన్సును మాత్రమే రద్దు చేశారు. మిగిలిన వాటి గురించి ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు’ అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.


