‘సంజీవని’ ముసుగులో దోపిడీ! | Chandrababu Govt new Conspiracy: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘సంజీవని’ ముసుగులో దోపిడీ!

Aug 28 2026 5:43 AM | Updated on Aug 28 2026 5:43 AM

Chandrababu Govt new Conspiracy: Andhra Pradesh

ప్రైవేటు సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా కార్యక్రమానికి రూపకల్పన 

అదే సంస్థ ద్వారా పైలట్‌ ప్రాజెక్టు అమలు.. రూ.350 కోట్లతో తుది కాంట్రాక్టూ అదే కంపెనీకి ధారాదత్తం 

పైలట్‌ అమలుకు ముందే మంత్రులు ప్రైవేట్‌ సంస్థ కార్యాలయం సందర్శన 

కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న దోపిడీ ‘స్కెచ్‌’.. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన విధానాన్ని ఏపీ నెత్తిన రుద్దుతున్న బాబు సర్కారు  

సాక్షి, అమరావతి: పేదలకు ప్రాణం పోస్తున్న ఆరో­గ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసే నాడు–నేడు కార్యక్రమానికి తూట్లు పొడవటం.. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం.. ఇలా వైద్య రంగాన్ని చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కారు.. అక్కడితో ఆగకుండా పక్క రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దుతూ ఖజానాకు భారీగా గండి కొడుతోంది.

ప్రైవేట్‌ కంపెనీలకు నిధుల పంట పండిస్తోంది. కర్ణాటకలో ఘోరంగా విఫలమైన డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ (డీఐఎన్‌సీ–డింక్‌) విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. డింక్‌ సాఫ్ట్‌వేర్‌ రూపొందించిన కంపెనీకే దాని అమలు కాంట్రాక్టును అప్పగించడం ద్వారా ఏకంగా రూ.­350 కోట్లు ఇచ్చేయడానికి ప్రభుత్వం దాదాపు సన్నద్ధం అయిపోయింది. అదే సంజీవని ప్రాజెక్టు. ప్రభు­త్వ పెద్దల క్విడ్‌ ప్రోకో స్కెచ్‌లో సంజీవని పురుడుపోసుకుందని వైద్య శాఖలో ప్రచారం జరుగుతోంది.

మంత్రుల పర్యటన నుంచి కాంట్రాక్ట్‌ వరకూ అంతా ‘స్కెచ్‌’
సాధారణంగా ఏదైనా కొత్త పథకం, కార్యక్రమం అమలు చేసే ముందు ప్రజల అవసరాలు, అప్పటికే అందుబాటులో ఉన్న వనరుల వినియోగం, ప్రజాధనం వృథా కాకుండా ప్రభుత్వం విధానాలు రూపొందించాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలి. ఇందుకు పూర్తి భిన్నంగా సంజీవని కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కా­రు తెరపైకి తెచ్చింది. టాటా సంస్థ రూపొందించిన ‘డింక్‌’ను నేరుగా ఓ విధానంగానే స్వీకరించేసింది. 2024 డిసెంబర్‌లో ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్‌ కర్ణాటక రాష్ట్రం కోలార్‌లోని డింక్‌ కార్యాలాయాన్ని సందర్శించారు.

తర్వాత కొద్ది రోజులకే ఏపీలోనూ డింక్‌ సేవలు ప్రారంభిస్తామని బాబు సర్కార్‌ ప్రకటించింది. ఇదే సంజీవని ప్రాజెక్టు అని చెప్పింది. అదే సంస్థ ద్వారా  కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టు చేస్తున్నట్లు తెలిపింది. తర్వాత చిత్తూరు జిల్లావ్యాప్తంగా అమలు అంటూ హడావుడి చేసింది. సంజీవని పైలట్‌ ప్రాజెక్టు కోసమే రూ.10 కోట్లు ఖర్చు పెట్టేసింది. పైలట్‌ ప్రాజెక్టులో ఆమోఘమైన ఫలితాలు వచ్చాయని, రాష్ట్రం మొత్తం సంజీవని అమలు చేసేస్తామని సీఎం ప్రకటించారు. కొద్ది రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అమలు కోసం వైద్య శాఖ టెండర్‌ పిలిచింది.

రూ.350 కోట్లకు పైగా నిధులతో ఐదేళ్ల పాటు కార్యక్రమం అమలు చేయడానికి టాటా సంస్థే టెండర్‌లో ప్రథమ స్థానంలో నిలిచినట్టు సమాచారం. త్వరలోనే కాంట్రాక్టును వైద్య శాఖ అధికారికంగా కట్టబెట్టబోతోందని తెలుస్తోంది. మంత్రుల కోలార్‌ పర్యటన, డింక్‌నే విధానంగా ప్రభుత్వం స్వీకరించడం, తుది కాంట్రాక్ట్‌ను అదే సంస్థకు కట్టబెట్టడం.. ఇదంతా పక్కా దోపిడీ ‘స్కెచ్‌’లో భాగంగా కాక మరేంటని వైద్య రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. వైద్య శాఖ పిలిచిన టెండర్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పాల్గొంది. అయితే డింక్‌నే ప్రభుత్వం విధానంగా స్వీకరించి టెండర్‌ పిలవడంతో ప్రభుత్వ రంగ సంస్థ పోటీలో నిలవలేకపోయిందని సమాచారం.

పైలట్‌ ప్రాజెక్టులోనే చాప చుట్టేసిన కన్నడ సర్కారు
కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లాలో డింక్‌ కార్యక్రమాన్ని 2017లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేశారు. అయి­తే ఆ కార్యక్రమం ఘోరంగా విఫలం కావడం, ప్రజా­రోగ్య రంగంలో డింక్‌తో పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవని గుర్తించిన కన్నడ సర్కారు పైలట్‌ దశలోనే చాపచుట్టేసింది. అదే సమయంలో కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం), ఈ–సంజీవని వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.

దీంతో రాష్ట్రంలో సొంతంగా ఒక ప్రత్యేక నెట్‌వర్క్‌ను నడిపితే డేటా డబుల్‌ ఎంట్రీ అవ్వడంతో పాటు, ప్రజారోగ్య సమాచార గోప్యతకు దెబ్బతింటుందని కర్ణాటక ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. అదే డింక్‌ కార్యక్రమాన్ని గేమ్‌ చేంజర్‌ అంటూ చంద్రబాబు సర్కార్‌ డబ్బా కొడుతోంది. పక్క రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన కార్యక్రమాన్ని ఏపీ ప్రజల నెత్తిన రుద్దడమే కాకుండా ఏకంగా రూ.350 కోట్ల మేర ప్రజాధనాన్ని కొల్లగొట్టేస్తోంది.

ప్రైవేటు భాగస్వామ్యం లేకుండానే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అద్భుతాలు
ఏ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, నిధుల దుబారా లేకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగంలో అద్భుత సంస్కరణలు తెచ్చారు. గ్రామ స్థాయిలో 2,500 జనా­భాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రజలకు టెలీ కన్సల్టేషన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ వైద్య సేవలు, మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెఫరల్స్, ప్రజల ఆరోగ్య సమాచారం డిజిటలీకరణ వంటి అనేక మార్పులు తీసుకొచ్చారు.

అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనట్టుగా నేరుగా ప్రభుత్వ వైద్యులే ప్రజల దగ్గరకు వెళ్లారు. ఇలా 2024 నాటికే ఎంతో కీలకమైన ప్రివెంటివ్‌ కేర్‌లో గ్రామ స్థాయిలో సమర్థ వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉంది. చంద్రబాబు ప్రభుత్వం దీన్నంతటిని నిర్వీర్యం చేసేసి, విఫల కార్యక్రమం డింక్‌ కోసం ఏకంగా రూ.350 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడుతుండటంపై వైద్య నిపుణులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement