జగన్ ఆదేశాలతో కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులకు లేఖలు రాశాం
వెన్నుపోటు పార్టీ పాలనలో మత్స్యకారులకు భద్రత లేకుండా పోయింది
వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి అర్బన్: సముద్రంలో వేటకు వెళ్లి 24 రోజుల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుమిట్టాడిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, కేంద్రంపై తీసుకొచి్చన ఒత్తిడే కారణమని వైఎస్సార్‌సీపీ నేత, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చెప్పారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 3న ఓడలరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో తాము కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌కు లేఖలు రాసి పరిస్థితి తీవ్రతను వివరించినట్లు తెలిపారు.
శ్రీలంక, బంగ్లాదేశ్, మయ న్మార్ ఎంబసీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసినట్లు చెప్పారు. పార్టీ నేత వాసుపల్లి జానకిరామ్ కోస్ట్‌గార్డ్ హెడ్ క్వార్టర్స్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేయించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ వినతికి స్పందించిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి, విదేశీ ఎంబసీలకు, కోస్ట్ గార్డ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో మత్స్యకారుల భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గురుమూర్తి మండిపడ్డారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళితే తిరిగి ప్రాణాలతో వస్తారో, రారో అన్న దుస్థితి నెలకొందని చెప్పారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడంతో పాటు, వేట నిషేధ సమయంలో ‘మత్స్యకార భరోసా’ ఇచ్చి ఆదుకుందని తెలిపారు. వారికి డీప్ సీ ఫిషింగ్ బోట్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ ఫైళ్లన్నీ అటకెక్కించిందన్నారు. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా ‘సేఫ్టీ ఆడిట్’ నిర్వహించలేదన్నారు. మహా రాష్ట్ర ప్రభుత్వం జాలర్లకు శాటిలైట్ ఫోన్లు ఇస్తుంటే, ఇక్కడ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
బోట్లలోని ట్రాన్స్‌పాండర్లు, నావిగేషన్ పరికరాలు పనిచేయకపోయినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, శాటిలైట్ ఫోన్లు ఇవ్వాలని, ట్రాన్స్‌పాండర్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నావిగేషన్ పరికరాలు 24 గంటలూ పనిచేసేలా సోలార్ పవర్ బ్యాకప్ ఏర్పాటుచేసి, ప్రతి బోటుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు అందించాలని కోరారు.


