ప్రాణాలు పోతే వినతిపత్రం కావాలా? | Family members of the deceased deposed TDP MP Lavu Srikrishna Devarayalu | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతే వినతిపత్రం కావాలా?

Aug 28 2026 5:32 AM | Updated on Aug 28 2026 5:32 AM

Family members of the deceased deposed TDP MP Lavu Srikrishna Devarayalu

టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నిలదీసిన మృతుల కుటుంబ సభ్యులు

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వచ్చి హామీ ఇవ్వాలంటూ ధర్నా

హైవేపై బైఠాయింపు.. స్తంభించిన రాకపోకలు 

చిలకలూరిపేటటౌన్‌/యడ్లపాడు: పల్నాడు జిల్లా చిలకలూ­రిపేట వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దళితులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బాధిత కుటుంబాలు, దళిత సంఘాల ఆగ్రహం తీవ్రస్థాయికి చేరింది. ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడినా ప్రభుత్వం నుంచి తగిన భరోసా, పరిహారం ప్రకటించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. 

బాధితుల సమస్యలను విన్న ఎంపీ.. వినతిపత్రం ఇవ్వాలని, దానిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో బాధితులు భగ్గుమన్నారు.  ఇంతటి విషాదంలో ఉన్న తమకు ప్రభుత్వం నేరుగా అండగా నిలవాల్సింది పోయి వినతిపత్రం ఇవ్వాలని చెప్పడం ఏమిటంటూ వారు మండిపడ్డారు. పైగా.. ఇప్పటివరకు ఎలాంటి భరోసా కల్పించకపోవడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి..
ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరాయి. అలాగే, డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదంటూ బాధితులు సా.4.30కు చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో చీరాల–చిలకలూరిపేట మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

అక్కడి నుంచి ఆందోళనకారులు ర్యాలీగా బయల్దేరి జాతీయ రహదారి–16పై బైఠాయించారు. సా.7.30 గంటల నుంచి మూడు గంటలకు పైగా ధర్నా పెద్దఎత్తున కొనసాగింది. తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ధర్నాతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వాటిని మళ్లించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement