కమిషనర్‌ ఔట్‌.. పీఆర్‌సీ లేదు.. ఉద్యోగులకు వెన్నుపోటు! | Chandrababu TDP alliance Govt Fraud To Employees | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ ఔట్‌.. పీఆర్‌సీ లేదు.. ఉద్యోగులకు వెన్నుపోటు!

Aug 28 2026 5:10 AM | Updated on Aug 28 2026 5:10 AM

Chandrababu TDP alliance Govt Fraud To Employees

ఎన్నికల హామీలను విస్మరించి బాబు సర్కారు మోసాలు

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.40 వేల కోట్లకుపైనే 

చంద్రబాబు నిర్వాకం వల్ల ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టం    

ఉన్న కమిషనర్‌ను ఉద్దేశపూర్వకంగానే తప్పించి కాలయాపన ఎత్తుగడ.. పెండింగ్‌లో 5 డీఏలు.. 

ఐఆర్‌ ప్రస్తావనే లేదు.. ఉద్యోగులపైనే ఆర్థిక భారం  

పాత బేసిక్‌పైనే గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌ లెక్కింపు 

రిటైరైన వేలాది మందికి జీవితాంతం పూడ్చలేని నష్టమే 

పొరుగు రాష్ట్రాల్లో చకచకా పీఆర్‌సీలు 

కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు అడుగడుగునా మోసమే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని వర్గాలనూ దారుణంగా వంచించిన సీఎం చంద్రబాబు ఉద్యోగులకూ వెన్నుపోటు పొడిచారు! ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్‌ (మధ్యంతర భృతి) ప్రకటించడంతోపాటు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తామన్న ప్రధాన హామీలకు సైతం తూట్లు పొడిచారు. పీఆర్‌సీ ప్రకటించకపోగా ఉన్న కమిషనర్‌నే బలవంతంగా తొలగించి పీఆర్‌సీ ఎగ్గొట్టేందుకు సన్నద్ధమయ్యారని ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు చిటికెలో పరిష్కరిస్తామని నమ్మబలికి ఇప్పుడు మోసం చేశారని మండిపడుతున్నారు. పీఆర్‌సీ అమలు, పెండింగ్‌ డీఏలు, ఐఆర్, సీపీఎస్‌ రద్దు లాంటి హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని రగిలిపోతున్నారు. 

కమిషనరే లేనప్పుడు.. నివేదిక ఎప్పుడు?
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12వ పీఆర్‌సీ కమిషనర్‌ మన్మోహన్‌సింగ్‌ను బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారు. ఖాళీ అ­యిన ఆ స్థానంలో వెంటనే కొత్త కమిషనర్‌ను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. అదే కమిషనర్‌ ఉంటే ఉద్యోగ సంఘాల నుంచి వినతులు స్వీకరించడం, ఆర్థిక పరిస్థితులు, నిత్యావసర ధరల పెరుగుదలపై నిశితంగా అధ్యయనం చేయడం, ఇతర రాష్ట్రాల్లో వేతన సవరణల­ను పరిశీలించి నివేదిక సిద్ధం చేసేవారు. సాధారణంగా ఇందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు కమిషనర్‌ను నియమించినా నివేదిక తయారు కావడానికే ఏడాదికి పైగా సమయం పడుతుంది. అసలు కమిషనరే లేనప్పుడు నివేదిక ఇంకెప్పుడు? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్‌ను నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలహరణం చేయటాన్ని బట్టి పీఆర్‌సీ ఇవ్వకుండా ఎగ్గొట్టే వ్యూహం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


ఐదేళ్లకు ఒకసారి బేసిక్‌ పే సవరణ.. 
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగుల బేసిక్‌ పే సవరించాలి. 11వ పీఆర్‌సీని 2022లో ప్రకటించినా 2018 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే పీఆర్‌సీ ప్రకటన తేదీ కంటే నాలుగేళ్లు ముందు నుంచి అమలు తేదీ ఉంటుంది. కానీ ఇంతవరకూ కమిషనరే లేకపోవడంతో అసలు పీఆర్‌సీ ఉంటుందో లేదోనని ఉద్యోగులు మధనపడుతున్నారు. 

ఐఆర్‌ అందక భారీగా నష్టపోతున్న ఉద్యోగులు
సాధారణంగా పీఆర్‌సీ నివేదిక వచ్చే లోపు ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊ­రట కల్పించేందుకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తారు. వైఎస్సార్‌సీపీ హ­యాంలో 27 శాతం ఐఆర్‌ ఇచ్చి ఉద్యోగులకు భరో­సా కల్పించారు. ఇప్పు­డు చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పీఆర్‌సీ కమిషనరే లేని పరిస్థితుల్లో ఐఆ­ర్‌ ప్ర­స్తావనే లేకుండా పో­యింది. ప్రభుత్వం ఐఆర్‌ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో ప్రతి ఉద్యోగీ నెలనెలా భారీగా ఆర్థికంగా నష్టపోతున్నా­రు. గతంలో అమలు చేసిన రెండు పీఆ­ర్‌సీలను పరిశీలిస్తే 27 శాతం ఐఆర్‌ ఇచ్చా­రు. దాని ప్రకారం చూస్తే రూ.50 వేల ప్రాథమిక వేతనం (బేసిక్‌ పే) కలిగిన సాధారణ ఉద్యోగి ప్రతి నెల రూ.13,500 నష్టపోతుండగా, రూ.లక్ష బేసిక్‌ పే ఉన్న ఉద్యోగి నెలకు ఏకంగా రూ.27 వేల వరకు కోల్పోతున్నారు. కనిష్ట బేసిక్‌ పే ఉన్న ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకుంటే సగటున ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.20 వేలు చొప్పున నష్టపోతున్నారు. 

మొత్తం బకాయిలు రూ.40 వేల కోట్లు.. 
చంద్రబాబు ప్రభుత్వం మొత్తంగా ఉద్యోగులకు ప్రతి నెలా చెల్లించాల్సిన దాదాపు రూ.1,000 కోట్లను ఎగ్గొడుతోంది. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు, 3.50 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గత రెండేళ్లుగా పీఆర్‌సీ, ఐఆర్‌ ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు కోల్పోయిన మొత్తం రూ.24 వేల కోట్లకు చేరుకుంది. దీంతో పాటు ఐఆర్‌ నిలిపివేయడమే కాకుండా 5 పెండింగ్‌ డీఏలు, పీఆర్‌సీ బకాయిలు, మానిటరీ బెనిఫిట్లు అన్నీ కలిపి రూ.40 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. తద్వారా ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు శాశ్వత ఆర్థిక నష్టం జరిగే దుస్థితి నెలకొంది.

రిటైర్‌ అయ్యేవారికి పూడ్చలేని లోటు
పీఆర్‌సీ అమలు కాకుండానే రిటైర్‌ అవుతున్న వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌ లెక్కింపు మొత్తం చివరి బేసిక్‌ పే మీదే ఆధారపడి ఉంటుంది. పీఆర్‌సీ రాకముందే రిటైరైతే పాత బేసిక్‌ పైనే ఈ లెక్కలు కట్టేస్తారు. అంటే జీవితాంతం అందుకోవాల్సిన పెన్షన్, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రెండూ శాశ్వతంగా తగ్గిపోతాయి. ఒక ఉద్యోగి పీఆర్‌సీ వచ్చాక రిటైరైతే అందుకునే పెన్షన్‌తో పోలిస్తే.. ముందుగానే రిటైరైన వారికి నెలవారీగా వేల రూపాయల చొప్పున శాశ్వత నష్టం వాటిల్లుతుంది. ఇది మళ్లీ సరిదిద్దలేని నష్టం. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో పీఆర్‌సీ ప్రక్రియలు నిర్ణీత గడువులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలో ఐఆర్‌ ఎప్పుడో ఇచ్చారు. ఏపీలో మాత్రం ఇంతవరకు కమిషనర్‌ నియామకమే జరగలేదు. ఇది ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాన్ని మరింత పెంచుతోందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. సరిహద్దు జిల్లాల్లో ఇరు రాష్ట్రాల ఉద్యోగులు పక్కపక్కనే పనిచేస్తున్నా జీతాల్లో వ్యత్యాసం ఏటికేడు పెరుగుతూనే ఉందని చెబుతున్నారు.

పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించకపోవడం దారుణం 
12వ పీఆర్‌సీ కమిషనర్‌ రాజీనామా చేసిన తర్వాత కొత్త వారిని నియమించకపోవడం దారుణం. దీనిపై ఉద్యోగులంతా ఆందోళనలో ఉన్నారు. మంత్రులు చర్చలకు పిలుస్తున్నారు గానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. 5 డీఏలు, పీఆర్‌సీ, రూ.వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టేసి అంతా ఇచ్చేశామంటున్నారు. ఒక్కో నెల గడిచే కొద్దీ ఉద్యోగులు వేల రూపాయలు నష్టపోతున్నారు. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉంది.  

– ఎస్‌. బాలాజీ, అధ్యక్షుడు, ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌)  

స్పందించకుంటే ఐక్యంగా ఉద్యమ బాట..
ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచి­పోయినా ఇప్పటివరకు పీఆర్‌సీ కమి­షన్‌ కమిషనర్‌ను నియమించలేదు. దీని­వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్ని­కల సమయంలో ఇచ్చిన మా­టను నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగులందరూ ఐక్యంగా ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది.
– కె ప్రకాశరావు, అధ్యక్షుడు, ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌–ఆప్టా

ప్రభుత్వం కావాలనే చేస్తోంది.. 
ప్రతి నెలా జీతం చూసుకున్నప్పుడల్లా బాధగా ఉంటుంది. పక్క రాష్ట్రంలో ఉద్యోగులకు పెరిగిన వేతనాలు ఎప్పటి నుంచో అందుతున్నాయి. మాకు మాత్రం ఇంతవరకు కమిషనర్‌ నియామకం కూడా జరగలేదు. ప్రభుత్వం కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. 
– రాష్ట్ర సచివాలయ ఉద్యోగి

ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అవమానిస్తున్నారు
ఉద్యోగులను అవమానించడం, ఇబ్బందిపెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారింది. పీఆర్‌సీ, ఐఆర్, రూ.40 వేల కోట్లకుపైగా బకాయిలు ఇవ్వకపోగా ఉద్యోగులకే బడ్జెట్‌ మొత్తం సరిపోతుందని చెప్పడం అన్యాయం. ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించకపోవడం ఏమిటి? కొత్త పీఆర్‌సీ కమిషన్‌ను ఇప్పటికిప్పుడు నియమించినా నివేదిక రావడం, ప్రభుత్వం ఆమోదించి అమలు చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఈ జాప్యం అంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు.
–  కె.వెంకట్రావిురెడ్డి, అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల సమాఖ్య

ఇవీ ఉద్యోగుల డిమాండ్లు
పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, ఆ వెంటనే పీఆర్సీ ఇవ్వాలి. 
⇒ పీఆర్సీ వచ్చే వరకు ఐఆర్‌ 30 శాతం ఇవ్వాలి. 
⇒ పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు వెంటనే ఇవ్వాలి. 
⇒ పోలీసుల సరెండర్‌ లీవ్స్‌ బకాయిలు చెల్లించాలి. 
⇒ జీపీఎస్‌ విధానాన్ని సమీక్షించి ఆమోద యోగ్య పరిష్కారం చూపాలి. 
⇒ అత్యవసర అవసరాలకు జీపీఎఫ్‌ విత్‌డ్రాకు వెంటనే అనుమతివ్వాలి.
⇒ రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు (జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్, గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూ్యరెన్స్, గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌) వెంటనే అందాలి. 
⇒ పెన్షనర్ల కోసం అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ ఇవ్వాలి. 
⇒ పెన్షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. 
⇒ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. 
⇒ మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement