ఉదయ్‌పూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్’లో 10 రోజుల పాటు బస చేసిన ఢిల్లీకి చెందిన నలుగురు సభ్యుల కుటుంబం రూ. 5.74 లక్షల బిల్లు చెల్లించేందుకు నిరాకరించినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి ఆగస్టు 12న ‘మేకర్ బహా ట్రావెల్ ఏజెన్సీ’ ద్వారా ఈ హోటల్‌లో బసను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆగస్టు 14 నుంచి 23 వరకు ఆ ఫైవ్ స్టార్ ప్రాపర్టీలో గడిపారు. ఈ క్రమంలో భోజనం, డిన్నర్ సహా హోటల్‌కు సంబంధించిన పలు సేవలను వినియోగించుకున్నారు.
తీరా చెక్‌అవుట్ సమయంలో హోటల్ సిబ్బంది రూ. 5.74 లక్షల బిల్లును వారికి అందించగా యాదవ్ ఆ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించారు. ఆ బిల్లు మొత్తాన్ని ట్రావెల్ ఏజెన్సీయే చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే బుకింగ్ సమయంలో యాదవ్‌తో అలాంటి చెల్లింపు ఒప్పందం ఏదీ కుదుర్చుకోలేదని సదరు ట్రావెల్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ వివాదంపై హోటల్ లైజన్ మేనేజర్ రవీంద్ర సింగ్ అంబామాతా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పర్యాటకుడు ట్రావెల్ ఏజెన్సీ పరస్పర కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తున్నదని సబ్ ఇన్‌స్పెక్టర్ అజయ్‌రాజ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. గతంలో తమిళనాడుకు చెందిన 69 ఏళ్ల బింగ్సన్ జాన్ అనే వ్యక్తి దాదాపు మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా 300కు పైగా లగ్జరీ హోటళ్లను మోసం చేసిన కేసులో జూలైలో అరెస్టయిన ఘటనను పోలీసులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఈ తాజా ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌కు సిమ్ కార్డులు పంపిన దంపతులు అరెస్ట్!


