ఢిల్లీ: నీట్, జేఈఈ లాంటి కీలక పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కీలక నియామకాలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్‌ను ఎన్‌టీఏ డైరెక్టర్‌గా నియమించింది. ఐదేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (DoPT) గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ ప్రసన్న వెంటేష్‌తో పాటు 2012 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రవి కుమార్ సింగ్‌ను ఎన్‌టీఏకు మరో డైరెక్టర్‌గా నియమించారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ప్రసన్న వెంకటేశ్, రవి కుమార్ సింగ్ ఐదేళ్లపాటు డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లు లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు.. ఏది ముందైతే అప్పటివరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు.


ప్రసన్న వెంకటేశ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. మరోవైపు రవి కుమార్ సింగ్ కేంద్ర డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయనను ఎన్‌టీఏ డైరెక్టర్‌గా నియమించారు.
ఇదే సమయంలో 2016 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్) అధికారి అమిత్ సాందారియాను NTA జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. డిప్యూటీ సెక్రటరీ స్థాయి హోదాలో ఆయన నాలుగేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
నీట్ పేపర్ లీకేజ్, పరీక్షల అవకతవకల నేపథ్యంలో ఎన్‌టీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దాని ప్రక్షాళనకు దిగిన కేంద్రం.. పలువురిని తప్పించింది కూడా. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎవరీ ప్రసన్న వెంకటేశ్?
2012 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి వీ ప్రసన్న వెంకటేశ్. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరులో బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. ఐఏఎస్‌లోకి వచ్చిన తర్వాత పాడేరు సబ్ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, అనంతరం ఏపీ సీఆర్‌డీఏ అదనపు కమిషనర్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, పోర్ట్స్ డైరెక్టర్, కర్నూలు జాయింట్ కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా 2019లో బాధ్యతలు చేపట్టిన ఆయన.. పారిశుధ్యం, చెత్త నిర్వహణ, నీటి సరఫరా, ట్రాఫిక్, నగర హరితీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై నుంచి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా ఐదేళ్ల కాలానికి నియమించింది. దేశవ్యాప్తంగా NEET, JEE వంటి కీలక పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ కీలక పాత్ర పోషిస్తుండడం, వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర, జిల్లా స్థాయి పరిపాలనలో అనుభవం ఉన్న ప్రసన్న వెంకటేశ్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: ఇక నో ఫెయిల్.. స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్


