నేపాల్‌ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్‌ | Nepal Floods Raise Fresh Concerns Over China Mega Dam, Could Medog Project Threaten India? Check More Details Inside | Sakshi
Sakshi News home page

నేపాల్‌ విలయం.. చైనా బ్రహ్మరాక్షసితో యమడేంజర్‌

Aug 27 2026 11:25 AM | Updated on Aug 27 2026 12:35 PM

Chinas Mega Dam: A Water Bomb Threat for India After Nepal FlashFloods

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం మరోసారి భయాందోళనలు రేపుతోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు, హిమపాతం ఘటనలు అక్కడి భౌగోళిక సున్నితత్వాన్ని(ఎక్కువ భూకంపాల ముప్పు) ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ విపత్తు నేపథ్యంలోనే చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టు మెడోగ్‌ డ్యామ్‌పై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కొందరు నిపుణులు ‘వాటర్‌ బాంబ్‌’గా అభివర్ణిస్తుంటారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా చైనా దీనిని దూకుడుగా ముందుకు తీసుకెళ్తుండడం మొదటి నుంచే ఆందోళన రేకెత్తిస్తోంది. పైగా  భూకంపాలకు అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో ఇంత భారీ నిర్మాణం భవిష్యత్తులో భారత్‌ ఈశాన్య ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

నేపాల్‌ వరదలతో పెరిగిన ఆందోళన
ఇటీవల నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 160 మంది మరణించారు. వందల మంది జలప్రళయంలో గల్లంతు అయ్యారు. తొలుత భూకంపం ధాటికి  వరదలు ముంచెత్తాయని నిపుణులు భావించినా.. మంచు ఫలకాలు విరిగిపడటం వల్ల భారీగా నీరు నదుల్లోకి చేరి వరద పోటెత్తిందని ఓ అంచనాకు వచ్చారు. ఆ రీజియన్‌లలో ఆనకట్టలు ఎక్కువగా ఉండడం కూడా ఈ విపత్తునకు మరో ప్రధాన కారణంగా మారింది.

ఇక హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుకైన భూకంప ప్రాంతాల్లో ఒకటి. చిన్న స్థాయి భౌగోళిక మార్పులు కూడా భారీ ప్రకృతి విపత్తులకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో చేపడుతున్న భారీ నిర్మాణాలపై ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

చైనా మెగా డ్యామ్‌ ఇదే..
చైనా టిబెట్‌లోని యార్లంగ్‌ త్సాంగ్‌పో నదిపై మెడోగ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇదే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్‌గా, ఆ తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. సుమారు 60 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే.. చైనాలోని త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ను మించి ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టుగా నిలిచే అవకాశం ఉంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.

భూకంప జోన్‌లో భారీ నిర్మాణం
మెడోగ్‌ డ్యామ్‌ నిర్మిస్తున్న ప్రాంతం భౌగోళికంగా అత్యంత సున్నితమైనది. ఈ ప్రాంతంలో క్రియాశీల ఫాల్ట్‌ లైన్లు ఉన్నట్లు కొన్ని భౌగోళిక అధ్యయనాలు సూచించాయి. భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్‌ నిర్మాణం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే భారీ స్థాయిలో నీటి ప్రవాహం దిగువ ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌కే ఎందుకు ముప్పు?
యార్లంగ్‌ త్సాంగ్‌పో నది దిగువ ప్రాంతంలో భారత్‌ ఉండటమే ప్రధాన కారణం. టిబెట్‌లో నది ప్రవాహంపై చైనా నియంత్రణ పెరిగితే.. భవిష్యత్తులో నీటి లభ్యత, వరదల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో డ్యామ్‌ నుంచి ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల్లో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు.

‘ఈశాన్యంపై కన్నేసిన నీటి ఆయుధం’?
వ్యూహాత్మక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు కేవలం విద్యుత్‌ ఉత్పత్తి కోసం మాత్రమే కాదు. నదీ ప్రవాహంపై ఆధిపత్యం సాధించే వ్యూహంలో భాగంగానూ దీనిని చూడాల్సి ఉందని అంటున్నారు. చైనా చేతుల్లో బ్రహ్మపుత్ర ఎగువ ప్రవాహ నియంత్రణ ఉండటం భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా విద్యుత్‌ ఉత్పత్తి, అభివృద్ధి లక్ష్యాలతోనే చేపడుతున్నట్లు చెబుతోంది.

భారత్‌ వ్యూహం సిద్ధం
చైనా ప్రాజెక్టు నేపథ్యంలో భారత్‌ కూడా నీటి భద్రతపై దృష్టి పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్‌ నదిపై సుమారు 11 వేల మెగావాట్ల సామర్థ్యంతో బహుళ ప్రయోజన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిల్వ, వరద నియంత్రణ, విద్యుత్‌ ఉత్పత్తి వంటి లక్ష్యాలను సాధించాలని భారత్‌ భావిస్తోంది.

భారత్‌, చైనా మధ్య అంతర్జాతీయ నదులపై సమగ్ర నీటి భాగస్వామ్య ఒప్పందం లేకపోవడం మరో ఆందోళన. ఎగువ ప్రాంతాల్లో జరిగే మార్పులపై ముందస్తు సమాచారం అందడం దిగువ దేశాలకు అత్యంత అవసరం. ప్రకృతి విపత్తులను పూర్తిగా నివారించలేకపోయినా.. ముందస్తు హెచ్చరికలు, పారదర్శక సమాచార మార్పిడి ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

భవిష్యత్తు ఎలా?
ఒకవైపు హిమాలయాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తులు.. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ నిర్మాణం.. ఈ రెండు అంశాలు కలిపి కొత్త చర్చకు దారితీశాయి. చైనా మెడోగ్‌ ప్రాజెక్టు నిజంగా ప్రమాదమా? లేదంటే అభివృద్ధి ప్రాజెక్టా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ హిమాలయాల సున్నిత పరిస్థితులు, బ్రహ్మపుత్ర ప్రాధాన్యం దృష్ట్యా అప్రమత్తత మాత్రం తప్పనిసరి. నేపాల్‌-టిబెట్‌ ప్లాష్‌ఫ్లడ్‌లు సంభవించిన వేళ చైనా ‘బ్రహ్మరాక్షసి’ మెగా డ్యామ్‌.. భారత్‌కు ‘వాటర్‌ బాంబ్‌’ ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

ఇది చదవండి: భూకంపం కాదు.. నేపాల్‌ వరదలపై అమెరికా సంచలన ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement