ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్‌! | Big Political Suspense Over Konda Surekha Family Issue | Sakshi
Sakshi News home page

ఇంకా బెంగళూరులోనే భట్టి.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై సస్పెన్స్‌!

Aug 27 2026 8:42 AM | Updated on Aug 27 2026 9:10 AM

Big Political Suspense Over Konda Surekha Family Issue

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. కొండా కుటుంబంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్రం నుంచి ఢిల్లీకి చేరడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది.

తాజా పరిణామాల్లో భాగంగా నిన్న కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి.. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంపై కొండా కుటుంబం తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం మాత్రం కఠిన చర్యల దిశగానే అడుగులు వేస్తుందా? అన్న చర్చ మొదలైంది.

ఇదిలా ఉంటే.. కొండా మురళి, రాజగోపాల్‌రెడ్డితో భేటీ అనంతరం భట్టి విక్రమార్క నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఖర్గేతో భట్టి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో కొండా కుటుంబం వ్యవహారంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను భట్టి ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా సుస్మిత తాజాగా చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో నెలకొన్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో.. ఆ సిఫారసులను అమలు చేయాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానం వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కొండా కుటుంబంతో పాటు సీనియర్‌ నేత చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని భట్టి కోరినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం క్రమశిక్షణతో ముందుకు సాగాలంటే.. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతలపై చర్యలు తప్పవని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.

ఇంకా బెంగళూరులోనే భట్టి..
మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం కూడా భట్టి విక్రమార్క బెంగళూరులోనే ఉండటం ఆసక్తిని పెంచుతోంది. మరోసారి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో కొండా ఫ్యామిలీపై కాంగ్రెస్‌ అధిష్ఠానం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. క్రమశిక్షణ కమిటీ సిఫారసులకు ఆమోదం లభిస్తుందా? కొండా కుటుంబంపై చర్యలు తప్పవా? చిన్నారెడ్డిపై కూడా వేటు పడుతుందా? లేక వివాదానికి మరోసారి సర్దుబాటు పరిష్కారం చూపుతారా? అన్నదానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

సీఎం, పీసీసీ అభిప్రాయాలపైనా చర్చ
ఇదిలా ఉండగా.. కొండా కుటుంబం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అభిప్రాయాలపైనా భట్టి-ఖర్గే మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని రాష్ట్ర స్థాయిలోనే ముగించాలా? లేక అవసరమైతే ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలా? అన్న అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ అంశాన్ని ఇకపై సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినట్లు సమాచారం.

చదవండి: ‘రేవంత్‌పై కొండా సుస్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement