నటి కృతి సనన్ నటించిన నగల యాడ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ యాడ్‌ను బీజేపీ ఎంపీ.. నటి కంగనా రనౌత్ విమర్శించడం, నటి కృతి సనన్ విమర్శలకు ఘాటు సమాధానం ఇవ్వడం, ఆ వెంటనే రాహుల్ గాంధీ కృతికి మద్దతు ప్రకటించడం, రాహుల్‌ను టార్గెట్ చేస్తూ కంగనా సెటైర్లు ఇలా రాజకీయ వివాదం నడిచింది. దీంతో సదరు జ్యువెలరీ బ్రాండ్ ఆ యాడ్‌నే తొలగించి.. క్షమాపణలు చెప్పింది. అయితే తాజాగా ఈ వివాదంపై.. కంగనా తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.
యాడ్‌లో రాఖీ కట్టే సమయంలో కృతి సనన్ ధరించిన దుస్తులపై కంగనా రనౌత్ విమర్శలు చేశారు. సంప్రదాయ పండుగకు సంబంధించిన ప్రకటనల్లో ఇలాంటి దుస్తుల వినియోగంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు కంగనా వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను విమర్శించారు. అయితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఒకరికి తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉన్నట్లే, ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించే హక్కు కూడా ఇతరులకు ఉంటుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
ఓ న్యూస్‌చానెల్ పాడ్‌కాస్ట్‌లో ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును ప్రశ్నించగా.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఒక వైపుకే పరిమితం చేయలేమని అన్నారు. ‘‘మీకు నచ్చిన విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటే.. ఆ వ్యాఖ్యలతో విభేదించే లేదా వాటిని వ్యతిరేకించే హక్కు ఇతరులకు ఎందుకు ఉండకూడదు?’’ అని రిజిజు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉంటుందని.. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ప్రశ్నించడం కూడా అదే స్వేచ్ఛలో భాగమని పేర్కొన్నారు.

ఆంక్షలు విధించలేను, కానీ..
బీజేపీ ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ చేసే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఆమెకు సభా నిబంధనలు, విధానాలపై సూచనలు చేయగలనని రిజిజు తెలిపారు. అయితే పార్లమెంట్ వెలుపల వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని చెప్పడం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు.
‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా స్పందన
ఇటీవల జెన్ జీ నిరసనల సమయంలో కంగనా చేసిన ‘గట్టర్ జనరేషన్’ వ్యాఖ్యలపైనా రిజిజు స్పందించారు. ఆమె మొత్తం యువతను ఉద్దేశించి అలా మాట్లాడలేదని.. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారని వివరించారు. ప్రధానిని లేదా ఆయన కుటుంబ సభ్యులను అవమానించే భాషను తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం, రాజకీయంగా వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు.
అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే ప్రమాణం
విమర్శలు, అభిప్రాయాల విషయంలో యువతీ యువకులకు వేర్వేరు ప్రమాణాలు ఉండకూడదని రిజిజు పేర్కొన్నారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. మనుస్మృతిపై జరుగుతున్న చర్చపైనా రిజిజు స్పందించారు. ఓ మత గ్రంథంలోని కొన్ని అంశాలను వ్యతిరేకించినంత మాత్రాన ఎవరినీ మత వ్యతిరేకిగా పరిగణించకూడదన్నారు. భారతదేశం మనుస్మృతి ఆధారంగా కాకుండా రాజ్యాంగం ప్రకారం నడుస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు ఒక నమ్మకాన్ని సమర్థించే హక్కు ఉన్నట్లే.. దానిని ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు.
“ఎవరైనా ఒక విషయాన్ని నమ్మవచ్చు.. మరొకరు దానిని వ్యతిరేకించవచ్చు. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి” అని రిజిజు పేర్కొన్నారు. అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించేలా, హింసను ప్రోత్సహించేలా చేసే వ్యాఖ్యలకు మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
స్విమ్మింగ్ మీమ్స్‌పై రియాక్షన్
అరుణాచల్ ప్రదేశ్‌లో తాజాగా ఓ నదిలో కిరెన్ రిజిజు ఈత కొట్టారు.అయితే ఆ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. రాహుల్ గాంధీలా చేయాలని చూసి బోల్తా పడ్డారంటూ కొందరు కామెంట్లు చేశారు. ఈ ట్రోలింగ్‌పై పాడ్‌కాస్ట్‌లో కిరెన్‌రిజిజు స్పందించారు. అరుణాచల్‌లో నదుల్లో ఈత కొట్టడం.. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టినట్లు కాదని, ట్రోల్ చేసేవాళ్లుక అది అర్థం కాదని అన్నారాయన. తాను అక్కడి బిడ్డనని, అక్కడి నేలా నీరు తనకు అలవాటేనని చెప్పారు.
పార్లమెంట్ మళ్లీ కొలువుదీరుతుందా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అవసరమైతే ఇదే సెషన్‌లో మరోసారి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. పార్లమెంట్‌ను ఎప్పుడు సమావేశపరచాలన్నది ప్రభుత్వ నిర్ణయమని.. రాష్ట్రపతికి ప్రభుత్వం సిఫార్సు చేస్తే సభను తిరిగి పిలవొచ్చని చెప్పారు. అయితే ప్రత్యేక సమావేశం ఉంటుందా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘‘నా వ్యాఖ్యలను రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు’’ అంటూ రిజిజు చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపై(డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు) ప్రభుత్వం మరోసారి ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.

అరుణాచల్ చిన్నారికి రిజిజు భరోసా
‘మమ్మల్ని చైనీస్ అని పిలవొద్దు.. మేము భారతీయులం’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన అరుణాచల్‌ప్రదేశ్ చిన్నారి టింకిల్‌తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వీడియో కాల్‌లో మాట్లాడారు. ‘‘ఇప్పుడు మొత్తం భారత్ నిన్ను ప్రేమిస్తోంది’’ అంటూ చిన్నారిని రిజిజు అభినందించారు. ఆమె తల్లిదండ్రుల గురించి అడిగి.. ధైర్యంగా మాట్లాడినందుకు ప్రశంసించారు. ఇటానగర్‌కు చెందిన టింకిల్.. తనను చైనీస్ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. ఈశాన్య ప్రాంత ప్రజలను రూపం ఆధారంగా వేరే దేశస్థులుగా భావించే ధోరణిపై మరోసారి చర్చ మొదలైంది. రిజిజు కూడా ఈశాన్య ప్రజలు భారతదేశంలో అంతర్భాగమని, వారి గుర్తింపును గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లుగా ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: మేకెదాటు వివాదంలో కొత్త ట్విస్ట్.. సాలిడ్ వార్నింగ్


