ఆదిపురుష్ భామ కృతి సనన్ చేసిన యాడ్ వివాదానికి కారణమైంది. ఓ జ్యువెలరీ సంస్థ రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై కూడా దుమారం చెలరేగింది. అంతేకాకుండా రాఖీని ఓ కుక్కకు కట్టడంతో ఇది కాస్తా ముదిరింది. హిందూ సంప్రదాయాలను కృతి అవమానించారంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందూ పండుగలంటే అంటే అంత చులకన అంటూ బాలీవుడ్ బ్యూటీని నిలదీశారు.
ఆ తర్వాత తనపై వస్తున్న వివాదంపై కూడా కృతి సనన్ స్పందించింది. మన సంప్రదాయాలను గౌరవించే విధానం మన దుస్తులపై ఆధారపడి ఉందని తెలిపింది. భక్తి అనేది మహిళ ధరించే దుస్తుల్లో ఉండదని.. అది ఆమె మనసుకు సంబంధించిన విషయమని పోస్ట్ చేసింది. మహిళల దుస్తులను టార్గెట్ చేయడం ఇంకెప్పుడు ఆపుతారని ప్రశ్నించింది. కుక్క కూడా మా ఫ్యామిలీ మెంబర్ అని.. అందుకే రాఖీ కూడా కట్టానని కృతి వెల్లడించింది.
తాజాగా ఈ వివాదం పెద్దఎత్తున వైరల్ కావడంతో యాడ్ రూపొందించిన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ కల్చర్, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు పూర్తి గౌరవముందని తెలిపింది. కుటుంబంతో పాటు పెంపుడు జంతువులపై ప్రేమను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ రూపొందించామని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే కొందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు యాడ్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.


