డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు చెప్పగానే అతడు, జల్సా, జులాయి, నువ్వే నువ్వే, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈయన ఫిల్మోగ్రఫీలోనే 'అజ్ఞాతవాసి' లాంటి డిజాస్టర్ కూడా ఉంది. 2018 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం.. అభిమానులు, ప్రేక్షకులకు పీడకలని మిగిల్చింది. ఈ సినిమా ఫెయిల్యూర్ టైంలో తనకు తన భార్య, పిల్లల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి త్రివిక్రమ్ ఆశ్చర్యపరిచాడు. ఫెయిల్యూర్‌ని దాచిపెట్టడం మనసులో మరింత బరువుని పెంచుతుందనే జీవిత సత్యాన్ని చెప్పుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతోనూ సమంత హెవీ వర్కౌట్స్.. ఇలా చేయొచ్చా?)
'ఫెయిల్యూర్‌ని దాచిపెట్టడమే ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. నేను ఇల్లు కడుతున్న టైంలోనే 'అజ్ఞాతవాసి' సినిమా తీశాను. ఇది పోవడంతో రెమ్యునరేషన్ మొత్తం 24 గంటల్లో వెనక్కిచ్చేయాల్సి వచ్చింది. నిర్మాత తనకు మిగిలిన లాభం వెనక్కిచ్చేశాడు. పవన్ కల్యాణ్ కొంత రెమ్యునరేషన్ వెనక్కిచ్చారు. మొత్తం అందరికీ సెటిల్ చేసేశాం. 48 గంటల్లో అంతా సెటిలైపోయింది. నా ఇంట్లో భార్య, పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్లకు ఇదంతా చెప్పడం ముఖ్యం అనుకున్నాను. నేనో సినిమా తీశాను అది ఆడలేదు. కాబట్టి మనం కడదామనుకుంటున్న ఇల్లు ఆపేద్దామనుకుంటున్నాను. మీకేమైనా సమస్యనా? రేపొద్దునా తేడా ఏమైనా వస్తే దాన్ని అమ్మేస్తానని అనగానే.. ఇది ఉంది కదా ఇది కూడా ఇల్లే కదా అని అన్నారు. దీంతో అది సమస్య కాదని అనిపించింది'
'తర్వాత భోజనం చేసి సంతోషంగా ఓ సినిమా చూసి పడుకున్నాను. సినిమా పోయిన విషయాన్ని దాచి యజమానిగా ఇప్పుడా బరువుని మోయాలి. ఇదెవరికీ చెప్పకూడదు. భార్య, పిల్లలకు తెలియకూడదు. తెలియకూడదని మనం అనుకోవడం తప్ప ప్రపంచానికి అంతా తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్లకు ఎందుకు తెలియకుండా ఉంటుంది. ముందు వాళ్లకే తెలుస్తుంది. కాకపోతే గౌరవంతో వాళ్లు మనకు చెప్పరు. చెప్పేయడం వల్ల మనకు ముందు తేలిగ్గా ఉంటుంది. ఇదే పెద్ద సమస్య అనే ఫీలింగ్ వాళ్లకు అనిపించదు. లేదంటే వాళ్లు కూడా వీడెందుకు మొహం అలా పెట్టుకుని లోపల అలా కూర్చున్నాడు బయటకు రావట్లేదు ఏంటిది అని వాళ్లు కూడా వాళ్లింట్లోనే వేరే వాళ్ల ఇంట్లో ఉన్నట్లు చూస్తారు. సినిమా మనం తీసి టార్చర్ వాళ్లకు పెట్టినట్లు ఉంటుంది' అని డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: 'ఇరుముడి' కోసం థియేటర్ బయట ప్రజలు ధర్నా)
Director #Trivikram on failures 🫡🔥
Failure is not the end… it’s a lesson that makes you stronger and better. ❤️🔥 pic.twitter.com/OaANJkDoQr— Milagro Movies (@MilagroMovies) August 25, 2026


