స్థానిక ఎన్నికల్లో మూడో వంతు సీట్లకు పట్టుబట్టాల్సిందే !
పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి పెంచుతున్న జనసేన శ్రేణులు
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో టీడీపీతో సమానంగా సీట్లు తీసుకోవాల్సిందేనని డిమాండ్
15 శాతం సీట్ల కేటాయింపునకు చర్చలు పూర్తయ్యాయన్న లోకేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం
లోకేశ్ చెప్పిన సీట్లకు ఓకే అంటే క్షేత్రస్థాయిలో ఇబ్బందేనంటున్న జనసేన నేతలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు మూడోవంతు(33 శాతానికి) తక్కువ కాకుండా సీట్లు డిమాండ్ చేయాలని అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆ పార్టీ శ్రేణులు ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో అత్యధిక సీట్లు డిమాండ్ చేయాలని సూచిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలూ అధినేత వద్ద ప్రతిపాదనలు పెట్టారని సమాచారం. ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో టీడీపీకి సమానం సీట్ల కోసం పట్టుబట్టాలని, లేకుంటే సంస్థాగతంగా బలోపేతం కావడం కష్టమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా మధ్య ప్రాంతం వరకు పార్టీ బలంగా ఉన్న చోట్ల ఎట్టిపరిస్థితుల్లోనూ 40శాతానికి తక్కువ కాకుండా సీట్లు తీసుకోవాలని అధినేతకు తెలియజేసినట్టు సమాచారం. మొత్తం 28 జిల్లా పరిషత్‌లకు గాను కనీసం తొమ్మిది.. 17 కార్పొరేషన్ మేయర్లకు కనీసం ఐదు జనసేన కోరాలని పార్టీ నేతల మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. తొమ్మిది జెడ్పీల్లో ఉత్తరాంధ్ర – కృష్ణా జిల్లా మధ్య ఆరు జెడ్పీలతోపాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర కార్పొరేషన్లలో ఏదో ఒకటి జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కోరుతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ అంశంపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిగిన సమయంలో కోరినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో టీడీపీపై ఎలా ఒత్తిడి తీసుకురావాలన్న అంశంపై పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేలను అడిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచి మొదలు కార్పొరేషన్ మేయర్ వరకు ప్రతి స్థానానికి జనసేన నుంచి పోటీకి అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయాలని, ఆ జాబితాలను టీడీపీ ముందుంచి సీట్లు కోరదామన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై రానున్న వారం, పది రోజుల్లోనే మరో విడత ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్‌కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారని చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కూటమి పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సర్దుబాటుపైనా చర్చలు జరిగాయని, అప్పట్లో పవన్ జనసేనకు మూడో వంతు సీట్లు ఇవ్వాలని కోరారని పలువురు జనసేన నేతలు చెబుతున్నారు.


