గతంలో పొలం వద్ద జరిగిన కేసు రాజీకి రావాలంటూ ఇప్పుడు ఒత్తిడి
రోజుల తరబడి స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్న ఎస్‌ఐ
ఎస్‌ఐ దుర్భాషలవల్లే తన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడని భార్య, సోదరుడు ఆరోపణ
బాధిత కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు
పిడుగురాళ్ల/మాచవరం: ఓ కేసులో రాజీకి రావాలంటూ ఎస్‌ఐ పెడుతున్న వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ కార్యకర్త శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతనిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాలు.. 2023లో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామానికి చెందిన బొంత గురవయ్యకు చెందిన పొలంలోకి టీడీపీకి చెందిన నంబుల వెంకటాద్రి, నంబుల గంగాధర్, యెనుముల గోపిలకు చెందిన గొర్రెలు వెళ్లాయి. దీంతో గొర్రెలను పొలంలోకి ఎందుకు దింపారంటూ వెంకటాద్రి, గంగాధర్, గోపిలను గురవయ్య ప్రశ్నించగా వారు గురవయ్యపై దాడిచేశారు.
అప్పట్లో గురవయ్య మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురవయ్యని ఊరు నుంచి వెళ్లిపోవాలంటూ టీడీపీ నాయకులు హుకుం జారీచేశారు. దీంతో గురవయ్య ఏడాదిన్నరగా పక్క గ్రామాల్లో ఉంటున్నాడు. ఇటీవల గురవయ్య తండ్రి చనిపోవడంతో కొత్తగణేశునిపాడు గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. ఇది తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకులు చల్లగుండ్ల భిక్షమయ్య, నంబుల గంగాద్రి, నంబుల సింగరయ్య, చల్లగుండ్ల శ్రీకాంత్, నన్నపనేని గంగ ప్రసాద్.. గురవయ్య వద్దకు వచ్చి ‘నువ్వు కేసు రాజీ చేసుకోవాలి’.. అని బెదిరించారు.
అలాగే, నెలరోజుల కిందట గురవయ్యను మాచవరం ఎస్‌ఐ పవన్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కేసు రాజీ చేసుకోవాల్సిందేనని, చేసుకోకపోతే నీపై ఎన్ని కేసులు నమోదవుతాయో తెలీదని బెదిరించారు. అయినా గురవయ్య కేసు రాజీచేసుకోలేదు. మళ్లీ శుక్రవారం ఉదయాన్నే కానిస్టేబుల్‌ను కొత్తగణేశునిపాడు గ్రామానికి పంపించి కేసు నిమిత్తం గురవయ్యను తీసుకెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లారు. గురవయ్య తమ్ముడు ప్రసాద్, కొంతమంది వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే, ఎస్‌ఐ పవన్‌కుమార్ ప్రసాద్‌ను ఉద్దేశించి.. ‘నువ్వు, మీ అన్నయ్య వైఎస్సార్‌సీపీలో తిరుగుతారంట కదా, కేసులు ఎందుకు రాజీ చేసుకోరురా’.. అంటూ అసభ్యపదజాలంతో దూషించి ఇష్టమొచ్చినట్లు కొట్టారు.
మరోవైపు.. శుక్రవారం రాత్రి స్టేషన్‌లో ఎస్‌ఐ పవన్‌కుమార్ గురవయ్యను తిట్టి, కొట్టి కేసు రాజీ చేసుకోకపోతే మరిన్ని కేసులు పెడతామని బెదిరించి పూచీకత్తుపై ఇంటికి పంపించేశారు. దీంతో బాధితుడు తీవ్ర మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంట్లో ఎలుకల మందు తిన్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురవయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు జరిగిన ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఎస్‌ఐ, టీడీపీ వాళ్లూ బెదిరించారు..
కేసు రాజీ చేసుకోవాల్సిందేనని ఎస్‌ఐ పవన్‌కుమార్ బెదిరించాడు. రోజు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి.. కేసు రాజీ చేసుకోవాల్సిందేనని దుర్భాషలాడాడు. అలాగే, వైఎస్సార్‌సీపీ వెంట తిరిగిన మీరు మాపై కేసులు పెడతారా.. ఎందుకు రాజీకి రారో చూస్తాం.. గ్రామంలో ఎలా ఉంటారో చూస్తామంటూ టీడీపీ నాయకులూ బెదిరించారు. వీటన్నింటితో గురవయ్య మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. – రమాదేవి, గురవయ్య భార్య.. ప్రసాద్, గురవయ్య తమ్ముడు
ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు..
గురవయ్యను కేసు నిమిత్తం పోలీసుస్టేషన్‌కు పిలిపించిన మాట వాస్తవమే. అతనిని శుక్రవారం పిలిపించి విచారణ అనంతరం 41(ఏ) నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించాం. ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. చికిత్స అనంతరం చట్ట ప్రకారం అతనిపై దర్యాపు చేపడతాం. ఆయన రాజీకి అంగీకరించలేదు. అతని నుంచి ఫిర్యాదు అందితే దానిపైనా దర్యాప్తు చేస్తాం. – మహేశ్వరరావు, గురజాల డీఎస్పీ


