ఒకవైపు విడాకుల కేసు.. మరోవైపు రూ.1.5 కోట్ల భరణం డిమాండ్.. ఇంకోవైపు కుటుంబ కలహాలు.. ఇవన్నీ కలిసి ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయా?. లక్నోలో ఓ బ్యాంకర్ భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపి, ఇంటికి వెళ్లి సొంత సోదరినీ హతమార్చి చివరకు తాను కూడా ప్రాణాలు తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. మూడు ప్రాణాలను బలిగొన్న ఈ దారుణం వెనుక అసలు కారణమేంటి?. మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న విషయాలు మరింత కలవరపెడుతున్నాయి.
దివ్యా మిశ్రా, మానస్ బాజ్‌పాయ్ 2017లో వివాహం చేసుకున్నారు. మొదట వారి వైవాహిక జీవితం సాఫీగానే సాగినప్పటికీ, కొంతకాలానికి కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరిలో దివ్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.
ఆగస్టు 18న కోర్టులో ఏం జరిగింది?
విడాకుల కేసు విచారణలో దివ్య రూ.1.5 కోట్ల భరణం కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచారణ అనంతరం మానస్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే రూ.1.5 కోట్ల డిమాండ్ ఒక్కటే హత్యకు కారణమని పోలీసులు ఇప్పటివరకు తేల్చలేదు. దంపతుల మధ్య ఉన్న గొడవలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా మానస్ చెల్లెలు షీబాతో ఉన్న విభేదాలను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.
ఒక్కరోజే మూడు కాల్పులు
గురువారం మధ్యాహ్నం గోమతీనగర్‌లోని తన కార్యాలయం వెలుపల దివ్యపై మానస్ కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం అతడు తన ఇంటికి వెళ్లాడు. అక్కడ తన 28 ఏళ్ల చెల్లెలు షీబాను కాల్చి చంపిన అనంతరం, తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మానస్ గదికి తాళం వేసుకుని టీవీ శబ్దాన్ని గట్టిగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల శబ్దం బయటకు వినిపించకుండా చేసేందుకే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
వాట్సాప్ స్టేటస్‌లో సంచలన ఆరోపణలు
దివ్యను హత్య చేసిన తర్వాత మానస్ పెట్టినట్లు చెబుతున్న వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. దివ్య తనను మోసం చేసిందని ఆరోపిస్తూ, తాను భార్యను చంపినట్లు అందులో పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, తాను, తన చెల్లెలు చనిపోతామని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం. దివ్య సోదరి, యూట్యూబర్ ప్రగ్యా మిశ్రా, ఆమె భర్త భరత్ పేర్లు కూడా ఆ సందేశంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రగ్యా, భరత్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని దివ్య బంధువు మయాంక్ దీక్షిత్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: నీ తల్లి కోసమైనా బతకాలి కదరా..
ఇది ముందే పన్నిన పథకమా?
ఇప్పుడు పోలీసుల ముందు ఉన్న మరో కీలక ప్రశ్న ఇదే. మానస్ దివ్యను హత్య చేసేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించాడా?. మూడు తుపాకుల స్వాధీనం, సీసీటీవీ దృశ్యాలు, దివ్య కదలికలపై అతడు రెండు రోజుల పాటు నిఘా పెట్టినట్లు వచ్చిన సమాచారం.. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, పొరుగువారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్, వాట్సాప్, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నారు. రూ.1.5 కోట్ల భరణం వివాదమే హత్యలకు కారణమా? కుటుంబ కలహాలే అసలు కారణమా? లేక మానస్ చివరి సందేశంలో పేర్కొన్న ఆరోపణల వెనుక మరేదైనా కథ ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.


