ఎన్నికలు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు అఖిలేశ్ కీలక సందేశం | Akhilesh Yadav amid rift rumours with Congress | Sakshi
Sakshi News home page

ఎన్నికలు, సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌కు అఖిలేశ్ కీలక సందేశం

Oct 4 2026 8:27 PM | Updated on Oct 4 2026 8:27 PM

Akhilesh Yadav amid rift rumours with Congress

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక సందేశం ఇచ్చారు. కూటమిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నది ముఖ్యం కాదని, ఎన్నికల్లో కూటమి విజయం సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో అఖిలేశ్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. “సీట్ల గురించి కాదు.. విజయం గురించి” అని ఆయన పేర్కొన్నారు. కూటమి భాగస్వాములకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేస్తుందన్న దానికంటే కూటమి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయడం ముఖ్యమని అన్నారు.

కూటమి గెలుపు ఒక్కో పార్టీ విజయంగా కాకుండా ఉమ్మడి ప్రయత్నానికి దక్కే విజయంగా ఉంటుందని అఖిలేశ్ పేర్కొన్నారు. మతతత్వానికి అడ్డుకట్ట వేయడం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రిజర్వేషన్లను పరిరక్షించడం, దేశంలో సామరస్యం, అభివృద్ధి, సౌభాగ్యం తిరిగి రావడం కోసం ఈ పోరాటం కొనసాగుతోందని చెప్పారు. ఇటీవల ఎస్పీ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ కాంగ్రెస్‌కు 150 సీట్లు కావాలన్న డిమాండ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో గెలవగా, ఎస్పీ 125 స్థానాలు గెలిచిందని పేర్కొంటూ కాంగ్రెస్‌కు 50 సీట్లకు మించి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.

అయితే అఖిలేశ్ తాజాగా పార్టీ నేతలకు సీట్ల సర్దుబాటుపై తమ అభిప్రాయాలు, ఆందోళనలను బహిరంగంగా కాకుండా పార్టీ అంతర్గతంగా చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ మాత్రం సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం కూటమిలోని అగ్ర నాయకత్వం తీసుకుంటుందని చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 403 మంది సభ్యుల అసెంబ్లీలో ఎస్పీకి 101 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2027 ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఎలా ఖరారవుతుందన్నది ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement