నాన్నను కొట్టారని.. దోశ షాపుపై ఇద్దరు అమ్మాయిల ప్రతీకారం | Two Girls In Varanasi Vandalised A Dosa Shop | Sakshi
Sakshi News home page

నాన్నను కొట్టారని.. దోశ షాపుపై ఇద్దరు అమ్మాయిల ప్రతీకారం

Nov 17 2026 11:25 AM | Updated on Nov 17 2026 11:37 AM

Two Girls In Varanasi Vandalised A Dosa Shop

తండ్రిపై దాడి చేశారనే ఆగ్రహంతో ఇద్దరు యువతులు ఓ దోశ షాపుపై విరుచుకుపడ్డారు. షాపులోని వస్తువులను చెల్లాచెదురు చేయడమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై, తినేందుకు వచ్చిన కస్టమర్లపైనా దాడి చేశారు. ఉన్నట్టుండి ఇద్దరు యువతులు చేసిన హంగామాతో షాపు వద్ద గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. మహమూర్‌గంజ్ ప్రాంతంలోని లీలా రామ్ దోశ వాలే షాపునకు నవంబర్ 14న రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఇద్దరు యువతులు స్కూటర్‌పై వచ్చారు. మొదట షాపులో వీడియోలు తీస్తూ కనిపించిన వారు.. ఆ తర్వాత ఒక్కసారిగా అక్కడి వస్తువులను విసిరేస్తూ విధ్వంసానికి దిగారు. షాపు సిబ్బందిని నిలదీస్తూ వారిపై చేయి చేసుకున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కస్టమర్లపై కూడా దాడి చేశారు.

తమ తండ్రిపై జరిగిన దాడే ఈ ఘటనకు కారణమని యువతులు చెబుతున్నారు. నవంబర్ 4న ఇదే షాపులో పనిచేసే సిబ్బంది తమ తండ్రిని దారుణంగా కొట్టారని ఆరోపించారు. ఈ విషయంపై భేలుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినా, దాదాపు రెండు వారాలుగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రికి న్యాయం జరగకపోవడంతోనే ఆగ్రహంతో షాపుకు వచ్చి దాడి చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు షాపు యజమాని మాత్రం భిన్నమైన ఆరోపణలు చేశారు. ఇద్దరు యువతులు డబ్బులు డిమాండ్ చేస్తూ తనను బెదిరించారని పేర్కొన్నారు. షాపులో విధ్వంసం సృష్టించడంతో పాటు సిబ్బంది, కస్టమర్లపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువతులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ప్రస్తుతం షాపులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతులు చేసిన ఆరోపణలు, షాపు యజమాని ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement