బ్రేకుల్లేని వందేభారత్‌ 463 కిలోమీటర్ల ప్రయాణం  | Empty Vande Bharat travels 463 km with faulty brakes | Sakshi
Sakshi News home page

బ్రేకుల్లేని వందేభారత్‌ 463 కిలోమీటర్ల ప్రయాణం 

Nov 16 2026 5:51 AM | Updated on Nov 16 2026 5:51 AM

Empty Vande Bharat travels 463 km with faulty brakes

ఖాళీ రైలును లాక్కెళ్లిన గూడ్స్‌ ఇంజిన్‌  

అక్టోబర్‌ 24వ తేదీన ఘటన.. తాజాగా వెలుగులోకి 

సమగ్ర దర్యాప్తునకు రైల్వే శాఖ అదేశాలు

న్యూఢిల్లీ: బ్రేకింగ్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయని వందేభారత్‌ రైలు ఏకంగా 463 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ప్రయాణికులు లేని ఈ రైలును గూడ్స్‌ ఇంజిన్‌తో జార్ఖండ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు లాక్కెళ్లారు. అక్టోబర్‌ 24వ తేదీన రాంచీ డివిజన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రైల్వే శాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోందని మండిపడింది. 

మార్గమధ్యంలో ఇతర ప్రయాణికుల రైళ్లు వచ్చి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని, ఇందుకు బాధ్యతెవరిదో తేల్చాలని ఆగ్నేయ జోన్‌ అధికారులకు ఈ నెల 7వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఇలాంటి నిర్లక్ష్యం కారణంగానే నవంబర్‌ 11వ తేదీన కోల్‌కతా–సాయిరంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ అసోంలో పట్టాలు తప్పడం గమనార్హం. జార్ఖండ్‌లోని హటియా నుంచి యూపీలోని ఝాన్సీకి తీసుకెళ్లేందుకు గాను వందేభారత్‌ బ్రేకింగ్‌ వ్యవస్థను గూడ్స్‌ ఇంజిన్‌తో సరైన రీతిలో అనుసంధానం చేయలేదన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. 

హటియాలో బయలుదేరి రాంచీకి చేరుకున్న తర్వాత లోకో పైలట్‌ బ్రేకులు సరిగ్గా లేవన్న విషయాన్ని అక్కడి సెక్షన్‌ కంట్రోలర్, ట్రాక్షన్‌ లోకో కంట్రోలర్‌కు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాంచీలోని మురి స్టేషన్‌ నుంచి రైలును నడిపిన పైలట్‌ సైతం సంబంధిత కంట్రోలర్లకు బ్రేకింగ్‌ వ్యవస్థ బలహీనంగా ఉన్నదంటూ సమాచారమిచ్చారు. అయినప్పటికీ, ఎవ్వరూ పట్టించుకోలేదు. రైలు చివరికి, యూపీలోని చందౌలీ జిల్లా దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ స్టేషన్‌కు చేరుకున్నాక మాత్రమే అక్కడి అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. 

ప్రత్యక్షంగా తనిఖీలు చేసి, బ్రేకులు ఫెయిలవుతున్న విషయాన్ని రిపోర్టు చేశారని రైల్వే శాఖ గుర్తించింది. కోచ్‌ల బ్రేకింగ్‌ సిస్టమ్‌లను ఉపయోగించకుండా, కేవలం గూడ్స్‌ ఇంజన్‌ బ్రేకులు, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌పై మాత్రమే ఆధారపడి ఈ రైలు దాదాపు 463 కిలోమీటర్లు ప్రయాణించిందని రైల్వే శాఖ తన ఉత్తర్వుల్లో వివరించింది. బ్రేకింగ్‌ వ్యవస్థలను తనిఖీ చేయడంతోపాటు, నిబంధనలను పట్టించుకోని అధికారులను తీరును ఎండగట్టింది. బాధ్యులను గుర్తించి, తగు క్రమశిక్షణ చర్యలను చేపట్టాలని, మున్ముందు ఇలాంటివి చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement