నక్సల్స్‌ హింసతో గిరిజన గోస  | Tribal communities most affected during Naxals Says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

నక్సల్స్‌ హింసతో గిరిజన గోస 

Nov 16 2026 5:25 AM | Updated on Nov 16 2026 5:25 AM

Tribal communities most affected during Naxals Says PM Narendra Modi

అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురయ్యారు  

వారికి ఓటు హక్కు కూడా లేకుండాపోయింది  

అప్పటి ప్రభుత్వాలు మూగ ప్రేక్షకులుగా మారిపోయాయి  

నేడు దేశం నక్సలిజం, మావోయిస్టు తీవ్రవాదం నుంచి విముక్తి పొందింది  

50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు 

‘జన జాతీయ గౌరవ్‌ దివస్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి  

న్యూఢిల్లీ: దేశంలో నక్సలైట్ల హింసాకాండ వల్ల గిరిజనులే అత్యధికంగా నష్టపోయారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మావో యిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గిరిజనులకు ఓటు హక్కు కూడా లేకుండా పోయిందని అన్నారు. పిల్లలను, యువతులను తీవ్రవాదులు అపహరిస్తుంటే గత ప్రభుత్వాలు మూగ ప్రేక్షకులుగా ఉండిపోయాయని ఆరోపించారు. గిరిజన విప్లవ వీరుడు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలీలో నిర్వహించిన ‘జన జాతీయ గౌరవ్‌ దివస్‌’లో మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. 

వివిధ రాష్ట్రాల్లో రూ.3,000 కోట్ల విలువైన 170కి పైగా గిరిజన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరో 70కి పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 12–13 ఏళ్లలో దాదాపు 50 కోట్ల మంది భారతీయులను తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం సాధించిన గొప్ప విజయాల్లో ఇది కూడా ఒకటి అని స్పష్టంచేశారు. మన దేశం నక్సలిజం, మావోయిస్టు తీగ్రవాదం నుంచి విముక్తి పొందిందని ప్రకటించారు. ఈ రెండు విజయాలు గిరిజన సమాజాల జీవితాలతో లోతుగా ముడిపడి ఉన్నాయని చెప్పారు. 

గిరిజనులు చాలాకాలం హింసను ఎదుర్కొన్నారని, అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వాలు వారిని అదృష్టానికే వదిలేశాయని, హక్కులను హరించివేశాయని విమర్శించారు. మావోయిస్టులు తల్లుల నుంచి పిల్లలను బలవంతంగా లాక్కున్నారని, గిరిజన యు వతులను అపహరించారని, ప్రభుత్వాలు మాత్రం నిస్స హాయంగా చూస్తూ ఉండిపోయాయని ఆరోపించారు. నేడు మావోయిస్టు హింసను నిర్మూలించడంతో పరిస్థితి మారిందని అన్నారు. మావోయిజం, నక్సలిజం ఓడిపోవడంతో గిరిజన తల్లులు, సోదరీమణులు ఇప్పుడు తమపై అపారమైన దీవెనలు కురిపిస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు.  

బిర్సా ముండాను స్ఫూర్తిగా తీసుకోవాలి  
బాల్యంలో హింస వల్ల ప్రభావితమైన పిల్లలకు ప్రస్తుతం విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా సిబ్బందితో కలిసి ఇటీవల జరుపుకున్న దీపావళి వేడుకలను గుర్తుచేసుకున్నారు. గతంలో నక్సల్స్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఈ పండుగ నేడు కేవలం దీపాల వెలుగునే కాకుండా ఆశల వెలుగును కూడా తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. 

ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘పీఎం–జన్‌మన్‌’, ‘ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్‌’ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లకు పైగా నిధులను కేటాయించామన్నారు. పేద కుటుంబాలకు నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్లు సమకూర్చామని, 18,000 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించామని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ప్రజలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. 

‘పీఎం ధన్‌–ధాన్య కృషి యోజన’కింద వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, తద్వారా రైతులు, గిరిజన వర్గాలకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అడవి బిడ్డలు సాగించిన కృషిని మోదీ ప్రస్తావించారు. ఒక గిరిజన మహిళ మన దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరిస్తుండడం మనకు గర్వకారణమని స్పష్టంచేశారు. బిర్సా ముండాను స్ఫూర్తిగా తీసుకొని, ‘వికసిత్‌ భారత్‌’లక్ష్య సాధన కోసం కష్టపడి పని చేయాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.  

బిర్సా ముండాకు మోదీ నివాళులు  
బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. ప్రజలకు జన జాతీయ గౌరవ్‌ దివస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ, హక్కులను నిలబెట్టుకోవడానికి ‘ధర్తీ ఆబా’ధైర్యం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. బిర్సా ముండా నుంచి స్ఫూర్తి పొందిన ప్రభుత్వం గిరిజన సమాజానికి గౌరవం, అవకాశాలు, శ్రేయస్సు కల్పించడానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. దేశ నిర్మాణానికి గిరిజన వర్గాలు చేసిన అమూల్యమైన కృషిని గుర్తించి, గౌరవించాలని ప్రజలకు సూచించారు.  

నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి 
బిర్సా ముండా జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం పార్లమెంట్‌ హౌస్‌ ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సైతం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒక గిరిజన నృత్య బృందం ప్రదర్శన ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా వారితో కలిసి గిరిజన సంప్రదాయ చెక్క వాద్యమైన ‘కర్తాల్‌’ను వాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement