మన చొరవతోనే యోగాకు ప్రపంచ ఆదరణ | PM Modi speech at Golden Jubilee Celebrations of Prashanti Kutiram | Sakshi
Sakshi News home page

మన చొరవతోనే యోగాకు ప్రపంచ ఆదరణ

Nov 14 2026 1:58 AM | Updated on Nov 14 2026 1:58 AM

PM Modi speech at Golden Jubilee Celebrations of Prashanti Kutiram

శుక్రవారం బెంగళూరులో పింక్‌ రైలులో ప్రధాని మోదీ, కర్ణాటక సీఎం శివకుమార్‌ నవ్వుల పువ్వులు

ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తున్నాం  

దేశాధినేతల కుటుంబ సభ్యులు సైతం యోగాను అభ్యసిస్తున్నారు  

‘ప్రశాంతి కుటీరం’ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ వెల్లడి  

బెంగళూరు/మైసూరు: భారతదేశం తీసుకున్న చొరవ ఫలితంగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆయుర్వేదం సహా సాంప్రదాయ వైద్య విధానాలను మన దేశం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యోగాను ఒక క్రీడగా స్వీకరించాయని, దేశాధినేతల కుటుంబ సభ్యులు సైతం ప్రతిరోజూ యోగాను అభ్యసిస్తున్నారని తెలిపారు.

 శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థ(ఎస్‌–వ్యాస) ఆధ్వర్యంలోని యోగ, పరిశోధనా కేంద్రం ‘ప్రశాంతి కుటీరం’స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సంస్థ ఒక సాధారణ యోగ కేంద్రం స్థాయి నుంచి సేవ, పరిశోధన, విద్య, ఆరోగ్య సంరక్షణకు అంకితమైన ఒక గొప్ప ఉద్యమంగా ఎదిగిందని ప్రశంసించారు. యోగాకు లభించిన అంతర్జాతీయ ఖ్యాతి గురించి ప్రస్తావించారు.

గత 12 ఏళ్లుగా భారతదేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం వల్లే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నారని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి యోగ ఒక చక్కటి మార్గంగా మారిందని వ్యాఖ్యానించారు.  

విదేశీ అభ్యాసకులకు పద్మశ్రీ పురస్కారం 
అనేక దేశాల్లో పాఠశాలలు, సంస్థలు, కార్యాలయాలకు యోగా చేరిందని, సౌదీ అరేబియా దీనిని ఒక క్రీడగా గుర్తించి, ప్రోత్సహించడానికి భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. విదేశీ ప్రముఖులతో తాను సంభాషించినప్పుడు యోగా తరచుగా ప్రస్తావనకు వచ్చేదని గుర్తుచేసుకున్నారు. 

తాను ఏ దేశానికి వెళ్లినా భోజన సమయంలో అక్కడి ప్రజలు తనతో యోగా గురించి చర్చిస్తుంటారని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు యోగా నేర్చుకుంటున్నారని, సాధన చేస్తున్నారని పలువురు దేశాధినేతలు తనతో చెప్పారని వెల్లడించారు. యోగా పట్ల విదేశీయులకు ఆసక్తి నానాటికీ పెరుగుతోందన్నారు. యోగాలో చేసిన సేవలకు గాను కొందరు విదేశీ అభ్యాసకులకు పద్మశ్రీ పురస్కారం లభించిందని పేర్కొన్నారు. 

ఆధునిక పరిశోధనలతో మేళవించాలి  
నేడు సమగ్ర ఆరోగ్య సంరక్షణ ఒక ప్రపంచ ఉద్యమంగా మారిందని, దీనివల్ల భారతదేశ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంపై అందరికీ అవగాహన పెరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం మొదటిసారిగా ‘ఆయుష్‌’కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, ఆయుర్వేదానికి సంబంధించిన పరిశోధనలను, పేటెంట్లను ప్రోత్సహిస్తోందని వివరించారు.

ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక పరిశోధనలతో మేళవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మన సాంప్రదాయ శా్రస్తాల ప్రయోజనాలు ప్రపంచ మానవాళికి చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. కన్నడ దిగ్గజ నటుడు దివంగత డాక్టర్‌ రాజ్‌కుమార్‌ను, కళలు, యోగాకు సేవలందించిన ప్రముఖులను మోదీ గుర్తుచేసుకున్నారు.

బెంగళూరు మెట్రో రైలు పింక్‌ లైన్‌ ప్రారంభం 
బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థలో భాగంగా రూ.3,470 కోట్ల వ్యయంతో నిర్మించిన పింక్‌ లైన్‌ను (కలేన అగ్రహార నుంచి తవరకెరె వరకు) ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. వారిద్దరూ కౌంటర్‌ వద్ద విడివిడిగా టికెట్లు కొనుగోలు చేశారు. 

బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలు మార్గం, ఫ్లైఓవర్‌ రెండింటినీ కలిగి ఉండే డబుల్‌–డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రధానమంత్రికి సీఎం డి.కె.శివకుమార్‌ వివరించారు. పింక్‌ లైన్‌ మొత్తం పొడవు 21.25 కిలోమీటర్లు, ఇందులో 18 స్టేషన్లు ఉన్నాయి. ప్రధానమంత్రి ప్రారంభించిన ఎలివేటెడ్‌ కారిడార్‌లో ఆరు స్టేషన్లు ఉండగా, భూగర్భంలో 12 స్టేషన్లు ఉంటాయి. ఈ భూగర్భ విభాగం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.  

ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం  
పశి్చమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గత దశాబ్ద కాలంలో తీసుకున్న చర్యలు ఎంతగానో దోహదపడ్డాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, పెట్రోలియం మౌలిక సదుపాయాలతో సహా కర్ణాటక వ్యాప్తంగా రూ.15,600 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. 

ఇరాన్, గల్ఫ్‌ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం మన దేశానికి ఇంధన భద్రత ఎంత ముఖ్యమో నిరూపించిందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిందని, ముడి చమురు నిల్వ సౌకర్యాలను అభివృద్ధి చేసిందని, సౌర, జల, పవన విద్యుత్‌ను విస్తరించిందని అన్నారు. 

రైల్వేలను దాదాపు 100 శాతం విద్యుదీకరించిందని, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేసిందని తెలియజేశారు. అమృత్‌ భారత్‌ పథకం కింద అభివృద్ధి చేసిన చామరాజనగర్, చిక్కమగళూరు, సక్లే‹Ùపుర, సుబ్రహ్మణ్యరోడ్‌ రైల్వే స్టేషన్లను సైతం మోదీ ప్రారంభించారు. వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపారు.  

మైసూరు వర్సిటీలో ఎల్‌ఈడీ డోమ్‌ ప్లానిటోరియం  
విజ్ఞానం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయని ప్రధాని మోదీ చెప్పారు. మన దేశ యువత ఖగోళ భౌతిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కొనియాడారు. మైసూరు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ కోసం భూమిని విరాళంగా ఇవ్వడం ద్వారా దేశంలో విజ్ఞాన శా్రస్తాన్ని ప్రోత్సహించడంలో మైసూరు రాజ కుటుంబం చేసిన కృషిని అభినందించారు. 

కర్ణాటకలోని చాముండి హిల్స్‌ వద్ద ఉన్న మైసూరు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఎల్‌ఈడీ డోమ్‌ ప్లానిటోరియం అయిన కాస్మోస్‌ను(సెంటర్‌ ఆఫ్‌ స్పేస్, మోడ్రన్‌ ఆప్టికల్‌ సైన్సెస్‌) మోదీ ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎల్‌ఈడీ డోమ్‌ ప్లానిటోరియం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement