బనశంకరి: సిలికాన్‌సిటీ బెంగళూరు మెట్రో చరిత్రలో మరో మైలురాయిని చేరుకుంది. బెంగళూరు నగరంలో రవాణా వ్యవస్థకు సరికొత్త వేగం అందించే నమ్మ మెట్రో పింక్‌లైన్ 7.5 కిలోమీటర్ల పొడవు ఎలివేటెడ్ మార్గాన్ని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం డీకే.శివకుమార్, గవర్నర్ సుధాయాదవ్, ఎంపీ తేజస్విసూర్య ప్రారంభించారు. బెంగళూరు మెట్రోమార్గం 96.1 కిలోమీటరు నుంచి 103.6 కిలోమీటర్లకు విస్తరించగా వంద కిలోమీటర్లను మించింది. 2011 అక్టోబరు 20 తేదీన బైయప్పనహళ్లి, ఎంజీ.రోడ్డు మధ్య కేవలం 6.7 కిలోమీటర్ల పొడవు మార్గంతో ప్రారంభమైన నమ్మమెట్రోను 15 ఏళ్ల వ్యవధిలో దశలవారీగా విస్తరించారు. ప్రస్తుతం పింక్‌లైన్ మొదటి దశ ప్రారంభం కావడంతో దేశంలోని ప్రముఖ మెట్రో మార్గాల్లో బెంగళూరు మరో ఘనతకెక్కింది.
ఆరు మెట్రోస్టేషన్లు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరు నగరంలోని ఎస్‌జీ.పాళ్య మెట్రోస్టేషన్‌లో పింక్‌లైన్ ఎలివేటెడ్ మార్గానికి పచ్చజెండా ఊపిన అనంతరం మెట్రోరైలు ఎక్కి ఐఐఎంబీ–బిలేకహళ్లి స్టేషన్ వరకు ప్రయాణించారు. కాళేనఅగ్రహార నుంచి ఎస్‌జీ.పాళ్య వరకు సుమారు 7.5 కిలోమీటర్ల పొడవు మార్గంలో ఆరు మెట్రోస్టేషన్లు ఉన్నాయి. కాళేనఅగ్రహార, హుళిమావు, ఐఐఎంబీ–బిలేకహళ్లి, ఎన్‌ఎస్.పాళ్య, జేపీ.నగర నాలుగో స్టేజ్, జయదేవ ఆసుపత్రి, ఎస్‌జీ.పాళ్య మెట్రోస్టేషన్లు ప్రయాణికుల సేవలకు సిద్ధమయ్యాయి. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో మెట్రోస్టేషన్లను రంగురంగుల పూలు, పింక్, యెల్లో రంగులతో అలంకరించారు. రోడ్లు, ఫుట్‌పాత్ మార్గాల్లో స్వచ్ఛత నెలకొంది. అక్కడక్కడ తారురోడ్లు వేశారు.
పటిష్ట పోలీస్‌భద్రత
ఎస్‌జీ.పాళ్య మెట్రోస్టేషన్ చుట్టుపక్కల పటిష్ట పోలీస్ భద్రత కల్పించారు. డాగ్‌స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
నేటి నుంచి ప్రజల సంచారానికి పచ్చజెండా
శుక్రవారం ప్రారంభమైన పింక్‌లైన్ ఎలివేటెడ్ మెట్రోమార్గంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి మెట్రోరైలు సంచారం ప్రారంభిస్తుంది. ప్రారంభంలో బీఈఎంఎల్ నుంచి వచ్చిన ఐదు మెట్రోరైళ్లు సంచరిస్తాయి. 8 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. పింక్‌లైన్ పూర్తి మార్గం కాళేనఅగ్రహార నుంచి నాగవార వరకు 21.26 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇందులో 7.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గం ఉండగా 13.76 కిలోమీటర్లు సొరంగమార్గం ఉంది. మొత్తం 18 స్టేషన్లకు గాను ఆరు ఎలివేటెడ్, 12 భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. మిగిలిన సొరంగమార్గం పనులు చేపడుతుండగా ఇది పూర్తికాగానే పూర్తిస్థాయిలో పింక్‌లైన్ అందుబాటులోకి వస్తుంది.
టికెట్ల ధర
బీఎంఆర్‌సీఎల్ పింక్‌లైన్ వివిధ స్టేషన్ల
మధ్య టికెట్ల ధర ఇలా నిర్ణయించింది.
● ఎస్‌జీ.పాళ్య నుంచి కాళేనఅగ్రహార వరకు రూ.30
● ఎస్‌జీ.పాళ్య నుంచి హుళిమావు వరకు రూ.20
● ఎస్‌జీ.పాళ్య నుంచి ఐఐఎంబీ–బీలేకహళ్లి రూ.20
● ఎస్‌జీ.పాళ్య నుంచి ఎన్‌ఎస్.పాళ్య, జేపీ నగర నాలుగోస్టేజ్ వరకు రూ.10
పింక్‌లైన్ ఎలివేటెడ్ మెట్రోమార్గం ప్రారంభం కావడంతో బన్నేరుఘట్ట రోడ్డు, దక్షిణ బెంగళూరులో పలు ప్రదేశాల నుంచి ప్రయాణికులకు సంచార అనుకూలం కానుంది. ప్రముఖ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వసతి ప్రదేశాలకు రాకపోకలు సాగించేందుకు ప్రజలకు రవాణా సంబంధాలు బలోపేతం అవుతాయి.
ఢిల్లీ తర్వాత రెండోస్థానం
పింక్‌లైన్ ఎలివేటెడ్ మెట్రోమార్గం ప్రారంభంతో బెంగళూరు మెట్రో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోమార్గంగా నిలవడం మరో విశేషం. ఢిల్లీ మెట్రో సుమారు 374.5 కిలోమీటర్ల పొడవు ఉండగా బెంగళూరు 103.6 కిలోమీటర్లతో రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుతం నమ్మమెట్రో పర్పల్‌లైన్ వైట్‌ఫీల్డ్ నుంచి చల్లఘట్ట వరకు సుమారు 43.49 కిలోమీటర్లు, గ్రీన్‌మార్గం మాదావర నుంచి సిల్క్ ఇన్‌స్టిట్యూట్ వరకు 33.46 కిలోమీటర్లు, యెల్లో మార్గం ఆర్‌వీ.రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు 19.15 కిలోమీటర్లు విస్తరించింది. ప్రస్తుతం పింక్‌లైన్ మొదటి స్టేజ్ చేరింది.
రూ.3,470 కోట్ల వ్యయం
కాళేనఅగ్రహార నుంచి ఎస్.జీ.పాళ్య వరకు పింక్‌లైన్ ఎలివేటెడ్ మార్గం నిర్మాణానికి సుమారు రూ.3,470 కోట్లు ఖర్చు చేశారు. పూర్తి పింక్‌లైన్ ప్రారంభమైన అనంతరం బెంగళూరు దక్షిణ, ఉత్తర బెంగళూరు నాగావర వరకు మెట్రోకనెక్టివిటీ సిద్ధం కానుంది.
బెంగళూరులోని సుద్దగుంటెపాళ్య మెట్రో స్టేషన్‌లో శుక్రవారం
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన పింక్‌లైన్ మెట్రో రైలు
మెట్రో రైలుకు పచ్చజెండా ఊపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్ర ంలో గవర్నర్ సుధా యాదవ్, సీఎం డీకే శివకుమార్, మంత్రి కృష్ణభైరేగౌడ
కార్యక్రమానికి హాజరైన ప్రజలు, విద్యార్థులు
బెంగళూరులో ప్రశాంతి కుటీర్ సభావేదికపై ప్రధానికి సన్మానం
ప్రధాని మోదీకి కెంపేగౌడ ప్రతిమ అందిస్తున్న సీఎం డీకే శివకుమార్
వందేభారత్ రైలు ప్రారంభం
మెట్రోమార్గం ప్రారంభంతో పాటు బెంగళూరు– గోవా మధ్య సంచరించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నమ్మమెట్రో విస్తరణకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. కాగా యశవంతపుర నుంచి గోవాలోని మడగాంవ్ వరకు సంచరించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, హాసన, సకలేశపుర, మంగళూరు, ఉడుపి, కారవారతో పాటు ప్రముఖ స్థలాల గుండా సంచరిస్తుంది. సుమారు 670 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలులో 16 బోగీలు ఉండగా సుమారు 1,128 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు. ఈనెల 15వ తేదీ నుంచి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రజలకు సేవలు అందిస్తుంది. పశ్చిమ కనుమల ప్రకృతి అందాల మధ్య సంచరించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కర్ణాటక, గోవా పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే అవకాశం ఉంది. ప్రధానమంత్రితో కలిసి సంచరించిన కోచ్‌లో నలుగురు ప్రముఖులకు మాత్రమే అవకాశం కల్పించారు. గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్, సీఎం డీకే.శివకుమార్, ఎంపీ తేజస్విసూర్య, బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ మెట్రోలో సంచరించారు. ఆరు కోచ్‌ల మెట్రోరైలులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రముఖుల సంచారానికి సంబంధించి ప్రత్యేక వ్యవస్థ కల్పించారు. మిగిలిన కోచ్‌ల్లో ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, బీఎంఆర్‌సీఎల్ సీనియర్ అధికారులు, సిబ్బంది, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు అవకాశం కల్పించారు. ప్రధాని మోదీకి సీఎం డీకే.శివకుమార్ నాడప్రభు కెంపేగౌడ ప్రతిమను బెంగళూరు ఐఐఎంబీ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమ వేదికపై అందజేశారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ
నమ్మ మెట్రో మార్గం 103 కిలోమీటర్లు


