● కొండ దీపావళి జాతరలో
రూ.2.19 కోట్ల వసూళ్లు
● 5 రోజుల పండుగలో
లడ్డూల అమ్మకాల్లో రికార్డు
● గత ఏడాదితో పోలిస్తే భారీగా
పెరిగిన ఆదాయం
మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు మలె మహదేశ్వర(మాదప్ప) కొండపై ఐదు రోజుల పాటు జరిగిన దీపావళి జాతరలో భక్తులు సమర్పించిన కానుకలు, సేవలు, ప్రసాదాల అమ్మకం ద్వారా మలె మహదేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధి అథారిటీకి మొత్తం రూ.2,19,26,715 ఆదాయం సమకూరింది. నవంబర్ 6 నుంచి 10 వరకు జరిగిన జాతరలో కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు మాదప్ప దర్శనం చేసుకున్నారు. ఈ ఐదు రోజుల వ్యవధిలో లడ్డూల అమ్మకం ద్వారా రూ.64,06,470, ప్రత్యేక ప్రవేశ రుసుము ద్వారా రూ.36,60,050, సమాచార కేంద్రం నుంచి రూ.6,27,700, మిశ్రమ ప్రసాదం ద్వారా రూ.5,90,625, ఇతర సేవా వనరుల నుంచి రూ.4,78,500, పుదువట్టి నుంచి రూ.2,43,422 లభించింది. గత ఏడాది మొత్తం రూ.2,16,45,020 వసూలైంది. ఈసారి ఆదాయం అంతకంటే ఎక్కువగా ఉందని మలె మహదేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధి అథారిటీ కార్యదర్శి పురుషోత్తం తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న సిమెంట్ లారీ
● భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు
● పెళ్లి పత్రికల పంపిణీకి వెళ్తుండగా ఘోరం
దొడ్డబళ్లాపురం: మరికొన్ని రోజుల్లో పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంటిని విషాదం కమ్మేసింది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా సిమెంట్ లారీ ఢీకొని భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నెలమంగల తాలూకా మైలనహళ్లి వద్ద చోటు చేసుకుంది. దొడ్డ తాలూకా ఉద్దిచిక్కనహళ్లిలో విజయ్‌కుమార్, దేవమ్మ(42) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె ఇంద్రాణి వివాహం ఈనెల 26, 27 తేదీల్లో జరగాల్సి ఉంది. దీంతో పెళ్లిపత్రికలు పంచేందుకు దంపతులు నెలమంగలకు వెళ్తుండగా మైలనహళ్లి వద్ద వెనుక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొంది. దేవమ్మ అక్కడికక్కడే మృతిచెందగా విజయ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. నెలమంగల గ్రామీణ పోలీసులు మృతదేహాన్ని, క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
సాయం కోసం ప్రధానికి వినతి
యశవంతపుర: రాష్ట్రంలో ఏర్పడిన కరువు నిర్వహణకు రాష్ట్రానికి సాయం చేయాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడానికి బెంగళూరు వచ్చిన ప్రధానిని బెంగళూరు నగరంలోని ఐఐఎంబీలో జరిగిన కార్యక్రమంలో సీఎం కలిసి ఈ మనవి చేశారు. వానలు లేక సాగు చేసిన పంటలు చేతికందక కరువును ఎదుర్కొంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేలు పరిహారం ప్రకటించింది. ఈనేపథ్యంలో కేంద్రం నుంచి అధిక సాయం అందచేయాలని డీకే శివకుమార్ మోదీకి విజ్ఞప్తి చేశారు.
ప్రధానికి రాష్ట్ర సమస్యలపై సీఎం వినతి
బనశంకరి: కరువు సహాయనిధుల విడుదల, మెట్రోప్రాజెక్టులకు గ్రాంట్లు, చెరకు రైతుల సమస్యల పరిష్కారం తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ శుక్రవారం ఐఐఎంబీలో నిర్వహించిన కార్యక్రమ వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వినవిపత్రం అందజేశారు.
ఎట్టకేలకు చిరుత బందీ
● గ్రామస్తులు, గొర్రెల కాపరులకు ఊరట
హొసపేటె: గ్రామస్తులు, గొర్రెల కాపరులను కొంత కాలంగా భయాందోళనలకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది. విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణ శివారులో అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. కూడ్లిగి పట్టణంలోని సిద్దయ్యనగుట్ట సమీపంలో ఓ చెట్టుపై చిరుత కూర్చుని ఉండటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా గొర్రెల కాపరులు తిరిగే ప్రాంతాల్లో సంచరించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారి సందీప్ నేతృత్వంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి చిరుతను సురక్షితంగా బంధించారు. అనంతరం పట్టుబడిన చిరుతను సురక్షితంగా మరో ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించారు.


