సాక్షి,బళ్లారి: నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లినే ఓ కుమారుడు హత్య చేశాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదనే కారణంతో కన్నతల్లినే హత్య చేయడం దావణగెరె జిల్లాలో కలకలం రేపింది. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా దొడ్డఘట్ట గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దొడ్డగట్ట గ్రామానికి చెందిన బుళ్లమ్మ(70) అనే వృద్ధురాలిని ఆమె కుమారుడు హనుమంతప్ప(35) మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో దారుణంగా కట్టెలతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు, స్థానికులు వెల్లడించారు. బుళ్లమ్మకు పది మంది సంతానం. భర్త మరణించిన తర్వాత ఎన్నో కష్టాలు, బాధలను ఎదుర్కొంటూ తొమ్మిది మంది కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి, ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమతో గారాబంగా పెంచింది.
ఆది నుంచీ నేరచరితే..
అయితే ఆ కుమారుడు నేర కార్యకలాపాల్లో పాల్గొంటూ మంచి నడతకు దూరమై తల్లినే సరిగా చూసుకోకపోగా నిత్యం గొడవకు కూడా దిగేవాడు. గతంలో డబ్బుల విషయంలో తన స్నేహితుడినే హత్య చేసిన కేసులో హనుమంతప్ప ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. కుమారుడు జైలుకు వెళ్లడంతో తల్లి అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. అనంతరం తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు చొరవ చూపి జైలులో ఉన్న తమ సోదరుడిని బెయిల్‌పై బయటకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం బుళ్లమ్మ తమ కుమార్తె ఇంట్లో ఉంటోంది. హనుమంతప్ప దావణగెరెలోని ఓ హోటల్‌లో పని చేస్తుండేవాడు. రెండు రోజులు క్రితం కుమారుడిని చూడాలనే కోరికతో హనుమంతప్పను ఇంటికి పిలిపించింది. గురువారం అక్క ఇంట్లో చికెన్ కూర, రొట్టె తిన్న హనుమంతప్ప తల్లిని పలకరించి వస్తానని చెప్పి, ఆమె వద్దకు వచ్చాడు.
కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు
నగదు కోసం కట్టెతో కొట్టి..
ఆమె వద్ద రూ.6 వేల నగదు ఉందని తెలిసి తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులిస్తే మద్యం తాగేందుకు వృథా చేస్తాడని భావించి కుమారుడికి తల్లి డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కుమారుడు తల్లిని కట్టెతో తలపై బలంగా కొట్టి హత్య చేసి మృతదేహాన్ని దుప్పటితో కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తల్లిని చూసేందుకు వెళ్లిన సోదరుడు మళ్లీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సోదరి శారదమ్మ అక్కడికి వెళ్లి చూడగా హత్యకు గురైన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందడంతో పోలీసులకు విషయం చేరవేశారు. సమాచారం అందుకున్న బసవాపట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.


