ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ‘‘ప్రధాని మోదీ నాతో నేరుగా చర్చకురావాలి. నాతో డిబేట్ తర్వాత.. మోదీ ప్రధానిగా కొనసాగలేరు. నన్ను పార్లమెంట్‌లో మాట్లాడనివ్వడం లేదు. అందుకే బహిరంగ చర్చకు రండి.. ముఖాముఖి చర్చిద్దాం’’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఇవాళ(శుక్రవారం) ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ’ సెషన్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంటులోనే చర్చ జరపవచ్చని బీజేపీ చెబుతున్నప్పుడు.. మీరు ప్రత్యేకంగా బహిరంగ చర్చకు ఎందుకు పట్టుబడుతున్నారంటూ ఓ వ్యక్తి ప్రశ్నించగా.. రాహుల్ స్పందిస్తూ.. లోక్‌సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తన మైక్రోఫోన్‌ను కూడా నిలిపివేస్తున్నారన్నారు. "వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్, చైనా, జనరల్ నరవణె పుస్తకం, ఎప్‌స్టీన్ అంశాలపై నన్ను మాట్లాడనివ్వలేదు. నాకు ఒకరితో ఒకరు నేరుగా చర్చ కావాలి. సుదీర్ఘ ప్రసంగాలతో కూడిన చర్చ నాకు వద్దు" అని రాహుల్ స్పష్టం చేశారు.
‘‘నేరుగా మాట్లాడుకునే విధంగా చర్చ ఉండాలన్న రాహుల్.. నరేంద్ర మోదీ నాపై ఆరోపణలు చేయాలి. నేను ఆయనపై ఆరోపణలు చేస్తాను. ఆయన రావచ్చు. మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది. ఒకవైపు మోదీ, మరో వైపు నేను కూర్చుంటాం. ఈ చర్చకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ లేదా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను న్యాయనిర్ణేతగా నియమించినా తనకు అభ్యంతరం లేదంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. కాగా, రాహుల్ సవాల్‌ను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. పార్లమెంటులో చర్చకు అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ అక్కడ చర్చకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సన్నాహాలు?


