అక్క కళ్లెదుటే బావను చంపిన తమ్ముడు.. విషాద ఘటన! | Rajasthan Brother In Law Kills Man In Hospital | Sakshi
Sakshi News home page

అక్క కళ్లెదుటే బావను చంపిన తమ్ముడు.. విషాద ఘటన!

Nov 13 2026 12:38 PM | Updated on Nov 13 2026 12:37 PM

Rajasthan Brother In Law Kills Man In Hospital

తండ్రి తన బావకు డబ్బులు ఇస్తున్నాడనే అనుమానం ఓ వ్యక్తిలో కక్ష పెంచింది. చివరకు ఆ కోపం హత్యకు దారితీసింది. అత్తను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన బావను.. బామ్మర్ది కత్తితో పొడిచి చంపాడు. భర్తను కాపాడేందుకు అడ్డువచ్చిన తన సోదరిపైనా దాడి చేశాడు. రాజస్థాన్‌లోని కోటాలో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

కోటాలోని ఓ ఆస్పత్రిలో తన అత్త చికిత్స పొందుతుండటంతో మౌలిక్‌ జైన్‌ (39) భార్యతో కలిసి ఆమెను చూసేందుకు వెళ్లాడు. అక్కడ రెండో అంతస్తులోని మెడిసిన్‌ ఐసీయూ బయట బామ్మర్ది కపిల్‌ జైన్‌ ఎదురయ్యాడు. తన తండ్రి.. బావకు ఆర్థిక సాయం చేస్తున్నాడనే అనుమానంతో కపిల్‌ చాలాకాలంగా మౌలిక్‌తో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో కపిల్‌ కత్తి తీసి మౌలిక్‌ ఛాతీలో పొడవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

భర్తపై దాడి జరగకుండా మౌలిక్‌ భార్య.. సోదరుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే కపిల్‌ ఆమెపైనా కత్తితో దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. గత ఆగస్టులోనూ కపిల్‌.. మౌలిక్‌ను ఫోన్‌లో బెదిరించడంతోపాటు ఆయన ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నెల రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇద్దరికీ సర్దిచెప్పి రాజీ కుదిర్చినా.. వివాదం మాత్రం సద్దుమనగలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కపిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మౌలిక్‌కు నాలుగేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి హత్యతో ఆ చిన్నారులకు తీరని లోటు ఏర్పడింది. మరోవైపు ఆస్పత్రిలోని ఐసీయూ బయటే హత్య జరగడం, ఘటన సమయంలో అక్కడి సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఆస్పత్రిలోకి కత్తితో నిందితుడు ఎలా వచ్చాడు? భద్రతా సిబ్బంది ఎందుకు అడ్డుకోలేకపోయారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: గొడ్రాలు అన్నందుకు.. భర్తను నరికి చంపింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement