న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కూటమి తెరపైకి వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం, చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీతో చేతులు కలిపింది. ఈ సందర్భంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముస్లింలను రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, హక్కులున్న పౌరులుగా గుర్తించడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తమ కూటమి ప్రధాన లక్ష్యం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమేనని స్పష్టం చేశారు.
ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలో తమను తాము సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే రాజకీయ పార్టీలు ముస్లింలను ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ముస్లింలను హక్కులున్న పౌరులుగా చూడటం లేదు. కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు. సెక్యులర్ పార్టీల అబద్ధాలు ప్రతి ఎన్నికల్లోనూ పునరావృతమవుతున్నాయి అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం ఎదగకుండా ఈ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఇతర కులాలకు ప్రత్యేక రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ముస్లింలకు అలాంటి అవకాశం దక్కడం లేదని అన్నారు.
బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం
చంద్రశేఖర్ ఆజాద్‌తో పొత్తుపై మాట్లాడిన ఒవైసీ.. దళిత, ముస్లిం ఐక్యత ఒక్కటే తమ లక్ష్యం కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని, బీజేపీ పాలనలో అరాచకం పెరిగిందని విమర్శించారు. ప్రభుత్వ బుల్డోజర్ చర్యల వల్ల ముస్లింలు బాధితులవుతున్నారని, ఉద్యోగాలు, విద్యారంగాల్లో వెనుకబడిపోతున్నారని ఆరోపించారు.
ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలపై ఎదురుదాడి
తమ కూటమి వల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందన్న విమర్శలను ఒవైసీ తోసిపుచ్చారు. ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసిందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో తమ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ ఓటమికి ఎవరు కారణమయ్యారని నిలదీశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీ పడుతోందని, అదే సమయంలో ఆప్‌ను బీజేపీ బీ టీమ్‌గా అభివర్ణిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల్లో ఇలాంటి వైరుధ్యాలు, ద్వంద్వ ప్రమాణాలు చాలా ఉన్నాయని అన్నారు. అలాగే, కొందరు నిర్దిష్ట వ్యక్తులు, కుటుంబాల వారసులే ముఖ్యమంత్రులు కావాలనే ధోరణి కొనసాగుతోందన్నారు. రాజుల పిల్లలే రాజులు కావాలనే రోజులు పోయాయి. ముస్లింలలో కూడా రాజకీయ చైతన్యం పెరుగుతోందని, స్వతంత్ర నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
అఖిలేశ్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తమకు పొత్తు ప్రతిపాదన ఇచ్చారన్న ప్రచారాన్ని ఒవైసీ ఖండించారు. అది 2026లో వచ్చిన అతిపెద్ద అబద్ధమని వ్యాఖ్యానించారు. తానే పొత్తు కోసం ప్రతిపాదన పంపానని, కానీ ఎస్పీ తిరస్కరించిందని వెల్లడించారు. గతంలో అఖిలేశ్ తనను రావణుడని, సంచార జీవి అని పిలిచారని గుర్తుచేశారు. ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులను సందర్శించినప్పుడు అక్కడి శిబిరాల్లో ముస్లింల పరిస్థితి తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. అదే తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారిందన్నారు. మొత్తంగా.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసిన ఒవైసీ.. సెక్యులర్ పార్టీలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లను కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే తమ ప్రయత్నమని చెబుతూ యూపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు.
ఇదీ చదవండి: అజిత్ మరణంతో అంతా మారిపోయింది.. సుప్రియా సూలే షాకింగ్ కామెంట్స్


