నాడు మౌనం.. నేడు 100 కోట్లతో ప్రచారమా?: రాహుల్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | BRS KTR Serious Comments On Rahul Gandhi | Sakshi
Sakshi News home page

నాడు మౌనం.. నేడు 100 కోట్లతో ప్రచారమా?: రాహుల్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Nov 13 2026 11:02 AM | Updated on Nov 13 2026 11:10 AM

BRS KTR Serious Comments On Rahul Gandhi

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో స్పందించని రాహుల్ గాంధీ.. ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ము రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రచార కార్యక్రమానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనలు, గిరిజన మహిళలపై దాడుల ఆరోపణలు, హైడ్రా కూల్చివేతలు, చెట్ల నరికివేత తదితర అంశాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా.. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో కొట్టించినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు చేసి, వారి దుస్తులు తొలగించి వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కష్టపడి ఇళ్లు నిర్మించుకున్న తెలంగాణ ప్రజల నివాసాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నప్పుడు ఢిల్లీలో నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో రాత్రికి రాత్రే 10 వేలకు పైగా చెట్లను నరికివేసి, జింకలు, నెమళ్లు సహా విలువైన పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. కేబీఆర్ పార్కు విధ్వంసంపై కూడా మౌనం వహించారని ఆరోపించారు.

రాజ్యాంగ ప్రక్రియలను అపహాస్యం చేస్తూ బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు కూడా రాహుల్ స్పందించలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎదుట మహిళా ప్రజాప్రతినిధుల చీరలు లాగి, వారిపై దాడులు చేసిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతగా రాహుల్ గాంధీ కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల బలవన్మరణాలు, జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు, క్రోనీ క్యాపిటలిజం, భూకబ్జాల వంటి అంశాలపైనా రాహుల్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా అవినీతి గురించి మాట్లాడుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. అవసరమైనప్పుడు మీరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రచార ఆర్భాటం కోసం వస్తున్నారు. అసలు మీకు ఆ హక్కు ఎక్కడిది రాహుల్ గాంధీ?' అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

ఇదీ చదవండి: నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement