టైర్–2 నగరాల్లో మాత్రం ‘ఒకే తోడు’వైపు 62% మంది మొగ్గు
సామాజిక ఒత్తిడి వల్లే పెళ్లి బంధంలో కొనసాగుతున్నామన్న 61% మంది
గ్లీడెన్ డేటింగ్ యాప్ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రేమ, పెళ్లి, బంధాలపై ఆలోచనలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్నాయి. డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా, మారుతున్న సామాజిక విలువలు సంప్రదాయ బంధాలకు సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్, ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ ఇప్సోస్‌తో కలిసి ప్రముఖ డేటింగ్ యాప్ గ్లీడెన్¯ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు మెట్రో నగరాలు, చిన్న నగరాల మధ్య తేడాను బయటపెట్టాయి.
సర్వేలో ఏం తేలిందంటే?
గ్లీడెన్–ఇప్సోస్ కలిసి 2025 మేలో టైర్–1 మహానగరాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లతోపాటు జైపూర్, లక్నో, చండీగఢ్, ఇండోర్, సూరత్, భోపాల్, భువనేశ్వర్ లాంటి టైర్–2 నగరాల్లో సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం.. టైర్–1 నగరాల్లో 46 శాతం మంది పెళ్లిళ్లు అయినప్పటికీ ‘పక్కచూపుల’గురించి ఆలోచించడం లేదా కనీసం ఆ ఆలోచనకు సానుకూలంగా ఉన్నారని సర్వే పేర్కొంది. మెట్రో నగరాల్లో దాంపత్య బంధం సంక్లిష్టంగా మారిందని గ్లీడె¯న్Œ పేర్కొంది. పెద్ద నగరాల్లో ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం, విడాకులపై మారుతున్న దృక్పథం, డేటింగ్ సంస్కృతి ఈ మార్పులకు కారణాలని విశ్లేషించింది.
టైర్–2లో 62% మంది మద్దతు ఒక్క జీవిత భాగస్వామికే..
టైర్–2 నగరాల్లో 62 శాతం మంది ఎప్పటికీ ఒకరికే అంకితమనే భావనకే మద్దతు ఇస్తున్నారు. చిన్న నగరాల్లోనే శాశ్వత ప్రేమపై విశ్వాసం ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. కుటుంబ బంధాలు, సామాజిక సాన్నిహిత్యం, సంప్రదాయ విలువలు అక్కడ ఇంకా బలంగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే టైర్–2 నగరాల్లోనూ మార్పు మొదలైందని.. కానీ వేగం తక్కువగా ఉందని నివేదిక చెబుతోంది.
సామాజిక ఒత్తిడి వల్లే పెళ్లి బంధంలో 61% మంది!
సర్వేలో మరో కీలక అంశం సామాజిక ఒత్తిడి. మొత్తంగా 61 శాతం మంది తాము వివాహ బంధంలో కొనసాగుతుండటానికి కారణం సామాజిక ఒత్తిడేనని చెప్పారు. సమాజం ఏమనుకుంటుందో అనే భయం, కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్తు వంటి కారణాల దృష్ట్యా ‘పక్కచూపులు’చూడాలనుకోవడం లేదని పేర్కొన్నారు. మొత్తంమీద మెట్రో నగరాల్లో ప్రత్యామ్నాయ బంధాలపై చర్చ పెరుగుతుంటే చిన్న నగరాల్లో జీవితాంతం ఒకే బంధానికి కట్టుబడి ఉండాలనే విశ్వాసం బలంగా ఉంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లోని యువతలో ఈ చర్చ మరింత బహిరంగంగా జరుగుతోంది.


