రూ.200 కోసం సుప్రీంకోర్టుకా? | Supreme Court on Rs 200 registration fee | Sakshi
Sakshi News home page

రూ.200 కోసం సుప్రీంకోర్టుకా?

Nov 13 2026 9:32 AM | Updated on Nov 13 2026 9:38 AM

Supreme Court on Rs 200 registration fee

సాక్షి, హైదరాబాద్‌: రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత స్వల్ప మొత్తానికి వినియోగదారుల రాష్ట్ర కమిషన్, జాతీయ కమిషన్‌ సహా అత్యున్నత న్యాయస్థానం, ఇప్పుడు ఇక్కడ.. ఇన్ని న్యాయస్థానాల చుట్టూ తిరగడం ఎంతవరకు సమంజసమని పిటిషనర్‌ను ప్రశ్నించారు. చిన్న వివాదాలను పట్టుదలకు పోయి పెద్దవిగా మార్చుకోవడంతో సమయం, డబ్బు వృథా కావడంతోపాటు ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందన్నారు. న్యాయస్థానం సమయాన్ని కూడా ఇలాంటి కేసులతో వృథా చేయొద్దని హితవు పలికారు. 

ఇరుపక్షాలతో న్యాయమూర్తి మాట్లాడటంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్‌ న్యాయవాది పేర్కొనగా, న్యాయమూర్తి అంగీకరించారు. అపోలో ఆసుపత్రిలో ఔట్‌ పేషెంట్‌గా వైద్యం చేయించుకునేందుకు వెళ్లిన రోగి నుంచి రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ విశాఖపట్నానికి చెందిన శంకర్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ నుంచి రూ.200 వసూలు చేయడం అక్రమమన్నారు. రూ.200 ఫీజు వసూలు చేయడంపై ఇంతవరకు న్యాయపోరాటం చేయడం అవసరమా అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ చిన్న మొత్తానికి రాష్ట్ర వినియోగదారుల కమిషన్, జాతీయ వినియోగదారుల కమిషన్, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి తిరిగి వచ్చి, మళ్లీ హైకోర్టులో వాదనలు వినిపించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

రోగి చరిత్ర కోసమే రిజిస్ట్రేషన్ 
ఏ ఆసుపత్రిలోనైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుందని, రోగి వైద్య వివరాలు, గతంలో చేయించుకున్న పరీక్షలు, ఆరోగ్య పరిస్థితులు తదితర సమాచారాన్ని భద్రపరచడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో రోగి తిరిగి ఆసుపత్రికి వచ్చినప్పుడు గత వైద్య చరిత్రను పరిశీలించేందుకు ఈ వివరాలు దోహదపడతాయని తెలిపింది. అపోలో ఆసుపత్రి కూడా ఐదు దశాబ్దాలకు పైగా వైద్య సేవలు అందిస్తోందని, కార్పొరేట్‌ ఆసుపత్రి అనగానే ప్రతికూల దృష్టితో చూడకూడదని వ్యాఖ్యానించింది. 

ఆసుపత్రి సేవలను, వైద్య రంగంలో దాని పాత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రూ.200 కోసం కోర్టు సమయాన్ని వృథా చేయడం సబబుకాదంది. వివాద పరిష్కారానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారని పిటిషనర్‌ న్యాయవాదిని అడిగింది. చిన్న చిన్న వివాదాల్లోనూ తామే నెగ్గాలనే ధోరణిని కక్షిదారులు ప్రదర్శించడం సరికాదంది. ఒకవేళ రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లోని రిజిస్ట్రేషన్ ను ప్రశ్నించాలంటే పిల్‌ వేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్‌ చెప్పడంతో సమ్మతించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement