ఎన్‌ఎస్‌ఈలో బెల్ మోగించిన ‘గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్’
ఎస్‌ఎస్‌ఈ ద్వారా రూ.1 కోటి నిధుల సమీకరణ
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరో చరిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా.చిన్నబాబు సుంకవల్లి 2013లో స్థాపించిన ఈ సంస్థ, ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక బెల్ రింగింగ్ వేడుకలో పాల్గొంది. ఎన్‌ఎస్‌ఈ సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎస్‌ఎస్‌ఈ) ప్లాట్‌ఫారమ్‌పై అధికారికంగా నమోదై నిధులు సమీకరించిన సంస్థల జాబితాలో నిలిచిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (రిజిస్ట్రేషన్ నంబర్: NSESSENP000165) వేడుక ఎక్స్ఛేంజ్ చరిత్రలో 18వ కార్యక్రమంగా నమోదైంది.
100 శాతానికి పైగా స్పందన
గత అక్టోబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించిన రూ.1 కోటి పబ్లిక్ ఇష్యూలో జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ (జెడ్‌సీజెడ్‌పీ) బాండ్ల ద్వారా 100 శాతానికి మించి సబ్‌స్క్రిప్షన్ సాధించి సంస్థ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ప్రక్రియకు EQUIPPP సంస్థ అడ్వైజర్‌గా, ఇంపాక్ట్ అసెస్‌మెంట్ భాగస్వామిగా వ్యవహరించగా.. జెరోధా, ఐసీఐసీఐ డైరెక్ట్ వంటి ప్రముఖ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సామాన్య ప్రజలు సైతం కనీసం రూ.1,000 నుంచి విరాళాలు అందించే వెసులుబాటు కల్పించారు. సాధారణ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు భిన్నంగా జెడ్‌సీజెడ్‌పీ సాధనాలపై ఎలాంటి వడ్డీ చెల్లింపులు గానీ, అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించే నిబంధన ఉండదు. ఇవి పూర్తిగా పారదర్శకమైన, నిబంధనలకు లోబడిన సామాజిక విరాళాలుగా ఉంటాయి. ముంబైలో జరిగిన ఈ వేడుకలో ఎన్‌ఎస్‌ఈ సీనియర్ అడ్వైజర్ శైలేష్ పాఠక్, ఎక్విప్ ప్రతినిధి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నివారణ వైద్యమే అసలైన ఆయుధం
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ, ‘ఆపరేషన్ థియేటర్‌లో సర్జన్‌గా నేను ఒక సమయంలో ఒక్క రోగికి మాత్రమే శస్త్రచికిత్స చేయగలను. కానీ ఆపరేషన్ థియేటర్ వెలుపల నివారణ వైద్యం, వ్యాధి ముందస్తు గుర్తింపు, భారీ స్థాయిలో స్క్రీనింగ్ వ్యవహారాల ద్వారా లక్షలాది మందికి చేరువ కావచ్చు. క్యాన్సర్ ముదిరి ఆపరేషన్ థియేటర్‌కు రావాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే గుర్తించి చికిత్స అందించడంలోనే చాలా సంతృప్తి ఉంటుంది. ఇది నా సేవల ప్రభావాన్ని అనేక రెట్లు పెంచుకునే అవకాశం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.
‘అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలి’
ఎన్‌ఎస్‌ఈ సీనియర్ అడ్వైజర్ శైలేష్ పాఠక్ ప్రసంగిస్తూ, ‘కేవలం కొడంగల్, మంథని వంటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడానికి రూ.1 కోటి సమీకరించగలిగినప్పుడు తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ప్రతి నెలా రూ.1 కోటి ఎందుకు సమీకరించలేరు? రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య కార్యక్రమాలను విస్తరించడానికి సోషియల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను ఒక అద్భుతమైన వేదికగా వినియోగించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వారసుల జీతం ఎంతంటే..
భవిష్యత్ ప్రణాళికలు
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తాజాగా సమీకరించిన నిధులను ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో 10,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు వినియోగించనుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ప్రివెంటివ్ ఆంకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఏఐ ఆధారిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లు, గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారాలు, ఇతర నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) స్క్రీనింగ్ విస్తరణపై సంస్థ దృష్టి సారించనుంది.


