స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారికి ముఖ్యమైన అప్‌డేట్. బలిపాడ్యమి (బలిప్రతిపద) పండుగ సందర్భంగా రేపు (నవంబర్ 10) దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలతో పాటు డెరివేటివ్స్, కరెన్సీ, కమోడిటీ మార్కెట్లు కూడా మూసివేయనున్నారు. కాబట్టి రోజూ ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
బలిపాడ్యమి పండుగను.. మహాబలి చక్రవర్తి జ్ఞాపకార్థం జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూడటానికి తిరిగి భూమికి వచ్చే రోజుగా ఈ పండుగను భావిస్తారు. ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, వేడుకలు నిర్వహిస్తారు. అందుకే స్టాక్ మార్కెట్లు కూడా ఈ రోజున సెలవు ప్రకటించాయి.
రేపు కేవలం షేర్ మార్కెట్ మాత్రమే కాకుండా.. డెరివేటివ్స్, కరెన్సీ ట్రేడింగ్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్, కమోడిటీస్ మార్కెట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ వంటి అన్ని ప్రధాన విభాగాల్లోనూ ట్రేడింగ్ నిలిచిపోతుంది. దీంతో.. ఇన్వెస్టర్లు రేపు ఎలాంటి కొనుగోళ్లు, అమ్మకాలు చేయలేరు.
ఇప్పటికే ఏవైనా ట్రేడింగ్ ప్లాన్లు వేసుకున్నవారు సెలవును దృష్టిలో పెట్టుకుని ముందుగానే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక స్టాక్ మార్కెట్లతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులకు, ఇతర వ్యాపార సంస్థలకు కూడా బలిప్రతిపద సందర్భంగా సెలవు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ సెలవు ప్రాంతాలను బట్టి మారుతుంది.


