దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్ సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభంలో లాభాలతో సందడి చేసిన సూచీలు చివరకు అమ్మకాల ఒత్తిడికి లోనై ఎరుపు రంగులోకి జారుకున్నాయి. దీంతో 2017 తర్వాత మళ్లీ తొలిసారిగా ముహూర్త్ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. 2018 నుంచి 2025 వరకు కొనసాగిన వరుస ఎనిమిది సానుకూల ముగింపులకు బ్రేక్ పడింది.
ఆదివారం (నవంబర్ 8) జరిగిన ఈ ప్రత్యేక సెషన్ సంవత్ 2083 ప్రారంభానికి గుర్తుగా నిర్వహించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 28.62 పాయింట్లు (0.04 శాతం) నష్టపోయి 80,999.40 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43.95 పాయింట్లు (0.18 శాతం) తగ్గి 24,986.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 25,131.85 స్థాయిని తాకిన నిఫ్టీ చివరకు 25 వేల దిగువకు పడిపోయింది.
అయితే, విస్తృత మార్కెట్లలో మాత్రం కొనుగోళ్ల జోరు కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.35 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.33 శాతం లాభపడ్డాయి. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లలో కొనుగోళ్లు జరగ్గా, బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ముహూర్త్ ట్రేడింగ్‌లో 2017 అక్టోబర్ 19న సెన్సెక్స్ 0.60 శాతం, నిఫ్టీ 0.63 శాతం నష్టపోయాయి. ఆ తర్వాత 2018 నుంచి 2025 వరకు ప్రతి ఏడాది ఈ రెండు సూచీలు లాభాలతోనే ముగిశాయి. 2022లో అత్యధికంగా సుమారు 0.88 శాతం చొప్పున పెరిగాయి. గత ఏడాది (2025) కూడా సెన్సెక్స్ 0.07 శాతం, నిఫ్టీ 0.10 శాతం లాభపడ్డాయి. ఈసారి మాత్రం ఆ సానుకూల ధోరణికి తెరపడింది.
కాగా, ముహూర్త్ ట్రేడింగ్ అనేది దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్వహించే ప్రత్యేక స్వల్పకాలిక ట్రేడింగ్ సెషన్. కొత్త హిందూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో శుభప్రదంగా పెట్టుబడులు పెట్టాలనే సంప్రదాయంతో ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటారు. అయితే, ఇతర ట్రేడింగ్ సెషన్ల మాదిరిగానే అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ సెంటిమెంట్, కొనుగోళ్లు, అమ్మకాలే సూచీల కదలికలను నిర్ణయిస్తాయి.


